Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని డోడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచింది. భారత సైన్యానికి చెందిన ఒక వాహనం లోయలో పడిపోవడంతో పది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది సైనికులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అమరులైన వీర సైనికులకు దేశం నివాళులు అర్పిస్తోంది. డోడా జిల్లాలోని భదర్వా–చంబా అంతర్‌రాష్ట్ర రహదారిపై ఖన్నీ టాప్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుల్లెట్ ప్రూఫ్ సైనిక వాహనం మొత్తం 17 మంది సిబ్బందితో కలిసి ఎత్తైన ప్రాంతంలోని ఒక పోస్ట్‌కి వెళ్తోంది. ఈ క్రమంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అది సుమారు 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.
READ MORE: Gautam Gambhir: ‘నేను నా సొంత జట్టుతోనే పోటీ పడుతున్నా’.. వివాదంగా మారిన గౌతమ్ గంభీర్ పోస్ట్..
ప్రమాదం జరిగిన వెంటనే సైన్యం, పోలీసులు కలిసి సహాయక చర్యలు ప్రారంభించారు. తొలుత నలుగురు సైనికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. మిగతా గాయపడిన వారిని బయటకు తీసుకొచ్చారు. తీవ్ర గాయాలైన ముగ్గురు సైనికులను హెలికాప్టర్ ద్వారా ఉదంపూర్ సైనిక ఆసుపత్రికి తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ మరికొందరు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య పది మందికి చేరింది. ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. “డోడాలో జరిగిన ఈ దురదృష్టకర ప్రమాదంలో పది మంది మా వీర సైనికులను కోల్పోయాం. వారి సేవలు, త్యాగాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి” అని పేర్కొంది.
READ MORE: Bhojshala Complex: భోజశాల మందిరామా, మసీదా..? ఒకప్పటి సంస్కృత విద్యా కేంద్రం, నేడు వివాదం..
గత ఏడాది మే నెలలో కూడా రాంబన్ జిల్లాలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న సైనిక కాన్వాయ్‌లోని ఒక ట్రక్ అదుపు తప్పి సుమారు 700 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఆ ప్రమాదంలో అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మాన్ బహదూర్ అనే ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు సరిహద్దు ప్రాంతాల్లో సైనికులు ఎదుర్కొనే కష్టాలను మరోసారి గుర్తు చేస్తున్నాయి. కఠిన భౌగోళిక పరిస్థితులు, ప్రమాదకర రహదారుల మధ్య దేశ భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న సైనికుల త్యాగానికి దేశం శిరసు వంచి నమస్కరిస్తోంది.
