NTV Telugu Site icon

Jagdeep Dhankhar: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్

Jagdeep Dhankar

Jagdeep Dhankar

Jagdeep Dhankhar: భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేపట్టిన బీజేపీ.. ఎట్టకేలకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసింది. జులై 19తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బీజేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా ఉన్న జగదీప్ ధన్‌కర్‌ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జేపీ నడ్డా ప్రకటించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.

1989 నుండి 1991 వరకు రాజస్థాన్‌లో ఝుంఝును నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ధన్‌కర్ పనిచేశారు. 1993 నుండి 1998 వరకు కిషన్‌నగర్ నియోజకవర్గ శాసనసభ సభ్యుడిగా పనిచేశారు.రాజస్థాన్ రాష్ట్ర న్యాయవాదుల బార్ కౌన్సిల్ సంఘానికి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. 2019 జూలై 30న రాష్ట్రపతి కోవింద్‌చే పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా నియమించబడ్డారు.సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన జగదీప్ ధన్‌కర్ ఎట్టకేలకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచారు.

కాగా.. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల ప్రచారాన్ని ఎన్డీయే, విపక్షాలు ముమ్మరంగా నిర్వహించాయి. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ద్రౌపది ముర్ము ఎన్‌డీఎ అభ్యర్థిగా ఉండగా, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఉన్నారు. సోమవారం ఎన్నిక జరగనుంది. కాగా.. భారత ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఆగస్టు 6న ఓటింగ్ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ జూలై 5న ప్రారంభం కాగా, జూలై 19తో ముగియనుంది. ఎలక్టోరల్ కాలేజీలో అధికార కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో ఎన్డీయే అభ్యర్థి విజయం ఖాయమైనట్లు పేర్కొంటున్నారు. ఏకాభిప్రాయం కోసం ప్రతిపక్ష పార్టీలు, మిత్రపక్షాలను సంప్రదించే అవకాశం ఉంది.

ప్రతిపక్ష పార్టీలు కూడా ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఆదివారం సమావేశం కానున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు జూలై 17న సమావేశం కానున్నట్లు కాంగ్రెస్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే తెలిపారు. ఈ సమావేశానికి విపక్ష నేతలందరూ హాజరవుతారన్నారు. భారత 16వ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఓటింగ్ ప్రక్రియ ఆగస్టు 6న జరగనుంది. అదేరోజు ఫలితాలు వెలువడుతాయి. ప్రస్తుత ఎం. వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10న ముగియనుంది. 11న కొత్త ఉప రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టనున్నారు.