IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..

Money

Money

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహించారు. సుమారు రూ.1,000 కోట్ల విదేశీ నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లో 9, విశాఖపట్నంలో 3, గుంటూరులో 1 సహా మొత్తం 13 కీలక ప్రాంతాల్లో ఐటీ బృందాలు ఒకేసారి విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. విదేశాలకు చెల్లించిన భారీ నిధుల వెనుక ఉన్న అసలు కారణాలపై అధికారులు లోతుగా దృష్టి సారించారు. ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ‘స్టాక్‌పైల్ సాఫ్ట్‌టెక్’ అనే సంస్థ కార్యకలాపాలపై ఐటీ శాఖ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ సంస్థ ద్వారానే దాదాపు రూ.900 కోట్ల విదేశీ చెల్లింపులు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించి దర్యాప్తు వేగవంతం చేశారు. అలాగే గుంటూరులో జరిగిన సోదాల్లో సుమారు రూ.130 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన పత్రాలను, ఆధారాలను ఐటీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.

సాఫ్ట్‌వేర్, కన్సల్టెన్సీ లేదా ఇతర సేవల పేరుతో విదేశాలకు నిధులను చట్టవిరుద్ధంగా తరలించారా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. హాంకాంగ్, సింగపూర్, యూకే, చైనా, ఇండోనేషియా వంటి దేశాల్లో ఉన్న పలు విదేశీ సంస్థలకు ఈ డబ్బు బదిలీ అయినట్లు ఐటీ వర్గాలు అనుమానిస్తున్నాయి. సాధారణ బ్యాంకింగ్ మార్గాలతో పాటు క్రిప్టో కరెన్సీ, హవాలా, సాంప్రదాయ అంగడియా వ్యవస్థలను ఉపయోగించి నిధులను విదేశాలకు పంపారా అనే కోణంలో కూడా సమగ్ర విచారణ జరుపుతున్నారు.