Site icon NTV Telugu

Mission Gaganyaan: సాంకేతిక సమస్యలు.. TV-D1 తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ ప్రయోగంలో స్వల్ప మార్పులు

Isro

Isro

Mission Gaganyaan: చంద్రయాన్‌-3, ఆదిత్య L-1 ప్రయోగాల విజయంతో దూసుకుపోతున్న భారత్ అంతరిక్ష పరిశోధనాసంస్థ ఇస్రో.. మరో ప్రతిష్టాత్మక గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు సమాయత్తమవుతోంది. దీనిలో భాగంగా.. గగన్‌యాన్‌ ప్రోగ్రామ్‌లో వినియోగించే ఫ్లైట్‌ టెస్ట్‌ వెహికల్‌ అబార్ట్‌ మిషన్‌-1 వాహకనౌక తొలి పరీక్ష నిర్వహించనున్నారు. దీని ద్వారా క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును పరీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఈ వాహకనౌకకు సంబంధించిన అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. ఉదయం 8 గంటలకు దీనిని నింగిలోకి తీసుకెళ్లి.. అందులోని క్రూ మాడ్యూల్‌ సముద్రంలో పడిపోయేలా చేస్తారు. అయితే, గగన్‌యాన్‌ టీవీ-డీ1 రాకెట్ ప్రయోగ సమయంలో చివరి నిమిషంలో స్వల్ప మార్పులు చేసింది ఇస్రో.

రాకెట్ లో సాంకేతిక లోపం తలేత్తడంతో అరగంట పాటు కౌంట్ డౌన్ ను పొడిగించారు ఇస్రో శాస్త్రవేత్తలు.. దీంతో.. ప్రయోగ సమయం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 8.30 గంటలకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.. ఇక, శ్రీహరికోటలో శాస్త్రవేత్తలతో ఈ ప్రయోగంపై సమీక్షిస్తున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్. కాగా.. అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లే గగన్‌యాన్‌ మిషన్‌ ప్రయోగాల్లో భాగంగా ఇస్రో కీలక పరీక్షలు చేపడుతోంది. ఇందులో భాగంగా మొదటగా క్రూ మాడ్యూల్‌ లోని సిబ్బంది తప్పించుకునే వ్యవస్థ పనితీరును పరీక్షిస్తోంది. మిషన్‌ ప్రయోగ క్రమంలో ఏదైనా వైఫల్యం తలెత్తితే దాని నుంచి సిబ్బంది సురక్షితంగా తప్పించుకునే లక్ష్యంతోనే ఈ పరీక్షను చేపడుతున్నారు. గగన్‌యాన్‌ మిషన్‌ సిద్ధమయ్యే నాటికి ఇటువంటి పరీక్షలు సుమారు 20వరకు చేయనున్నట్లు సమాచారం.

ఒకే ఇంజిన్‌ ఉండే వాహకనౌక.. క్రూ మాడ్యూల్‌, క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ను 17 కిలోమీటర్ల ఎత్తు వరకు మోసుకెళ్తుంది. తర్వాత అత్యవసర పరిస్థితిని సృష్టిస్తారు. దీనికోసం అబార్ట్‌ సిగ్నల్‌ను పంపిస్తారు. ఒకవేళ ఎస్కేప్‌ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే.. రాకెట్‌ నుంచి క్రూ మాడ్యూల్‌ విడిపోతుంది. దానికున్న పారాచూట్‌ సాయంతో సముద్రంలో పడుతుంది. భారత నౌకాదళం సిబ్బంది దానిని ఒడ్డుకు చేరుస్తారు. ఈ ప్రయోగం మొత్తం 8.5 నిమిషాల వ్యవధిలో పూర్తికానున్నట్లు వెల్లడించారు ఇస్రో అధికారులు .

Exit mobile version