పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇజ్రాయెల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహరోన్ హలీవా రాజీనామా చేశారు. అక్టోబర్ 7 వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది.
గతేడాది అక్టోబర్ 7న హమాస్ హఠాత్తుగా ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. ఇజ్రాయెల్ పౌరులను అపహరించుకుని తీసుకుపోయింది. ఈ పరిణామం ఇజ్రాయెల్‌ను షాక్‌కు గురి చేసింది. ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసుకున్న ఇజ్రాయెల్ ఈ ఊహించని పరిణామాన్ని పసి గట్టలేకపోయింది. అప్పటి పరిణామాలకు బాధ్యత వహిస్తూ తాజాగా మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ పదవికి అహరోన్ హలీవా రాజీనామా చేశారు.
అక్టోబర్ 7న హమాస్ దాడికి దారితీసిన వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ తమ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ చీఫ్ రాజీనామా చేసినట్లు ఇజ్రాయెల్ మిలటరీ సోమవారం తెలిపింది. ఇజ్రాయెల్ మరియు అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన దాడిని నిరోధించడంలో విఫలమైనందుకు మేజర్ జనరల్ అహరోన్ హలీవా రాజీనామా చేసిన మొదటి ఉన్నత స్థాయి అధికారి ఇతనే కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Pemmasani Chandrasekhar: నా విజయం ఖరారు.. భారీ మెజార్టీ సాధిస్తా
2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోయింది. కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ ప్రతీకార చర్యకు దిగింది. గాజాపై డ్రోన్లు, క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. గాజా నామరూపాలు లేకుండా చేసింది. అంతేకాకుండా హమాస్ ప్రతినిధులు టార్గెట్‌గా క్షిపణులను ప్రయోగించింది. ఇప్పటికే పలువురు నేలకూలారు. ఇప్పటికీ ఇజ్రాయెల్.. గాజాపై దాడులు చేస్తూనే ఉంది. ఇక సిరియా రాజధాని డమాస్కస్‌లో ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన క్షిపణి దాడిలో ఇరాన్‌కు చెందిన ముఖ్యమైన ఆఫీసర్లు చనిపోయారు. దీంతో ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్‌పై పగతో రగిలిపోతుంది. ఇప్పటికే బాలిస్టిక్, క్షిపణులు, డ్రోన్ దాడులతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. దీనికి ప్రతీకారంగా తాజాగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై ఎటాక్ చేసింది. కానీ ఇరు దేశాలకు ఎలాంటి నష్టం జరగలేదు.. అయినా కూడా ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యాధిపతి రాజీనామా చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంమైంది.
ఇది కూడా చదవండి: Beauty: మారుతి చేతుల మీదుగా ప్రారంభమైన ‘బ్యూటీ’