Benjamin Netanyahu: మధ్యప్రాచ్యంలో యుద్ధం రోజు రోజుకూ ఊపందుకుంటోంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ఈ తరుణంగా ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు సంచలన ప్రకటనలు చేశారు. ఇరాన్ ప్రభుత్వంపై జరుగుతున్న యుద్ధం ఇప్పటికే సగం లక్ష్యాలను పూర్తి చేసుకుందన్నారు. తాజాగా అమెరికన్ బ్రాడ్‌కాస్టర్ ‘న్యూస్‌మాక్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కాలపరిమితిని వెల్లడించలేదు. “ఇప్పటికే సగం కంటే ఎక్కువ యుద్ధ లక్ష్యాలను చేసుకున్నాం. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని చెప్పలేము. మేము నిర్దేశించుకున్న మిషన్లను బట్టి యుద్ధం ముగింపు ఉంటుంది. ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన వేలాది మంది సైనికులను ఇప్పటికే మట్టుబెట్టాం. ఇరాన్ ఆయుధ సంపత్తి, పారిశ్రామిక పునాదులు, ఆయుధ కర్మాగారాలు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని సమూలంగా దెబ్బతీశాం. ఇరాన్ ఇస్లామిక్ పాలన త్వరలోనే అంతర్గతంగా కుప్పకూలుతుంది. మా లక్ష్యం పాలనను మార్చడం కానప్పటికీ, వారి సైనిక శక్తిని, క్షిపణి సామర్థ్యాన్ని, అణు సామర్థ్యాన్ని బలహీనపరచడం ద్వారా ఆ దేశాన్ని లోలోపల నిస్సత్తువ చేస్తున్నాం. ” అని పేర్కొన్నారు.
READ MORE: Peddi : రామ్ చరణ్ పెద్ది వాయిదా ఫిక్స్.. అసలు కారణం ఏంటంటే
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహు కలిసి ఈ సైనిక చర్యను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేవలం నాలుగు నుంచి ఆరు వారాలు మాత్రమే ఘర్షణలు కొనసాగుతాయని అప్పట్లో ట్రంప్ పేర్కొన్నారు. కానీ.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటూ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ యుద్ధం నెలల తరబడి కాకుండా, మరికొన్ని వారాల్లోనే ముగిసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. చమురు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో అమెరికాలో ఈ యుద్ధంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
