Site icon NTV Telugu

ISIS: అస్సాంలో ఐఎస్ఐఎస్ ఇండియా హెడ్, కీలక సహాయకుడు అరెస్ట్

Isis

Isis

భారత్‌లో భారీ విధ్వంసాలకు కుట్ర పన్నిన ఇద్దర ఉగ్రవాదులను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశిస్తుండగా ఐఎస్ఐఎస్‌కు చెందిన ఇద్దరు ముష్కరులను అదుపులోకి తీసుకున్నారు. పొరుగు దేశంలో ప్రణాళికలు రచించి.. భారత్‌లో అమలు చేసేందుకు వీరిద్దరు కుట్ర పన్నినట్లుగా గుర్తించారు.

అస్సాంలోని ధుబ్రీలో ఐఎస్ఐఎస్ ఇండియా హెడ్, కీలక సహాయకుడిని భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. ఐఎస్‌ఐఎస్‌ చీఫ్‌ హరీస్‌ ఫరూఖీ అలియాస్ హరీష్‌ అజ్మల్‌ ఫరూఖీ, అతని సహచరుడు రెహాన్‌లను అరెస్ట్ చేశారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి అసోంలోని ధుబ్రీలోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా అరెస్ట్ చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టిలో మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఫరూఖీ, రెహాన్‌లు ఉన్నారు. వీరిద్దరిని అస్సాం పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ బుధవారం అరెస్టు చేసింది. భారత్‌లో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడేందుకు కుట్ర చేసినట్లు గుర్తించారు.

మంగళవారం సమాచారం రావడంతో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పార్థసారథి మహంత నేతృత్వంలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం వీరిద్దరిని అరెస్ట్ చేసేందుకు బయలుదేరింది. ఈ బృందానికి విశ్వసనీయ సమాచారం అందడంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో వేట ప్రారంభించారు. సరిహద్దు దాటిన తర్వాత ధుబ్రిలోని ధర్మశాల ప్రాంతంలో తెల్లవారుజామున ఉగ్రవాదులను విజయవంతంగా అరెస్టు చేశారు.

భారత్‌లో అనేక ప్రాంతాల్లో పేలుళ్లకు వీరు కుట్ర పన్నినట్లుగా పోలీసులు తెలిపారు. వీరిపై ఎన్‌ఐఏ, ఢిల్లీ, ఏటీఎస్, లక్నో తదితర ప్రాంతాల్లో అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసు అధికారి తెలిపారు. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి నిందితులను ఎన్‌ఐఏకి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

 

Exit mobile version