Rajasthan Honeytrap Case: భారతదేశంలో ఉంటూ పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్న వ్యక్తిని శనివారం అరెస్ట్ చేశారు. రాజస్థాన్ అల్వార్‌కు చెందిన ఒక యువకుడిని ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నారని రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ఆ యువకుడిపై ఆపరేషన్ సింధూర్ నుంచి నిఘా ఉంచినట్లు, ఈ రోజు ఆ యువకుడిని అధికారిక రహస్యాల చట్టం, 1923 కింద అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
పాక్ మహిళ హనీట్రాప్‌లో యువకుడు..
రాజస్థాన్‌లోని అల్వార్ అత్యంత సున్నితమైన, వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతం. అల్వార్‌లోని గోవింద్‌గఢ్ నివాసి అయిన మంగత్ సింగ్ కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయన చర్యలను నిశితంగా గమనించిన రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులు.. మంగత్ సింగ్‌ను పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. అల్వార్ కంటోన్మెంట్ ప్రాంతంలో నిఘా ఉంచిన సమయంలో గోవింద్‌గఢ్ నివాసి అయిన మంగత్ సింగ్ కార్యకలాపాలు అనుమానాస్పదంగా కనిపించినట్లు అధికారులు చెప్పారు. ఈ యువకుడిని ఇషా శర్మ అనే పాకిస్థానీ మహిళా హ్యాండ్లర్ హనీ-ట్రాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జైపూర్‌లోని ప్రత్యేక పోలీస్ స్టేషన్‌లో అధికారిక రహస్యాల చట్టం 1923 కింద మంగత్ సింగ్‌పై కేసు నమోదు చేయగా, రాజస్థాన్‌లోని CID ఇంటెలిజెన్స్ యువకుడిని అరెస్టు చేసింది.
సోషల్ మీడియా ద్వారా సమాచారం అందజేత..
గత రెండు ఏళ్లుగా మంగత్ సింగ్ సోషల్ మీడియా ద్వారా పాక్ నిఘా సంస్థకు చెందిన హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆపరేషన్ సింధూర్‌కు ముందు, తరువాత ఇషా శర్మ అనే పాకిస్థానీ మహిళా హ్యాండ్లర్‌తో మంగత్ సింగ్ సంప్రదింపులు జరిపారు. ఇషా శర్మ పన్నిన హనీట్రాప్‌లో పడి డబ్బు కోసం ఆకర్షితుడై, అల్వార్ నగరంలోని కీలకమైన కంటోన్మెంట్ ప్రాంతం, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర వ్యూహాత్మక ప్రదేశాల గురించి కీలకమైన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమెతో పంచుకున్నాడని అధికారులు చెప్పారు. జైపూర్‌లోని సెంట్రల్ ఇంటరాగేషన్ సెంటర్‌లో వివిధ నిఘా సంస్థలు విచారించిన తర్వాత, యువకుడి మొబైల్ ఫోన్‌ను పరిశీలించిన అనంతరం.. అక్టోబర్ 10, 2025న జైపూర్‌లోని ప్రత్యేక పోలీస్ స్టేషన్‌లో యువకుడిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రాజస్థాన్‌లోని సిఐడి ఇంటెలిజెన్స్ అధికారులు అతన్ని అరెస్టు చేశారు.
READ ALSO: Pakistan TLP: పాక్ నెత్తిన భస్మాసుర అస్త్రం.. దిక్కు తోచని స్థితిలో దాయాది
