Ishan Kishan Targets Tanveer Sangha in IND vs AUS 1st T20: భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు 20 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండేందుకు ప్రయత్నించాలని, తప్పకుండా ఎవరో ఒక బౌలర్‌ను లక్ష్యం చేసుకోవాలని యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ తెలిపాడు. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా బౌలింగ్‌ను టార్గెట్ చేయని సూర్యకుమార్ కుమార్ యాదవ్ తనకు చెప్పాడని తెలిపాడు. ప్రపంచకప్ 2023లో తాను తుది జట్టులో లేనప్పుడు కూడా ప్రాక్టీస్ చేయడం మాత్రం ఆపలేదని ఇషాన్ చెప్పాడు. గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్ చివరివరకు పోరాడి గెలిచింది. ఈ మ్యాచులో ఇషాన్ హాఫ్ సెంచరీ చేశాడు.
మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ… ‘ప్రపంచకప్ 2023లో నేను తుది జట్టులో లేనప్పుడు కూడా ప్రాక్టీస్ చేయడం ఆపలేదు. ఈరోజు నేను ఏం చేయాలి, ఈ సెషన్ నాకు ఎందుకు ముఖ్యం అని నాకు నేనుగా ప్రశ్నించుకునేవాడిని. ప్రతిరోజు నెట్స్‌లో విపరీతంగా శ్రమిస్తూనే ఉన్నా. కోచింగ్ సిబ్బందితో నా ఆట గురించి ఎప్పటికపుడు మాట్లాడుతా. ఏ బౌలర్‌ను టార్గెట్ చేయాలి?, గేమ్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? అనే దానిపై కసరత్తు చేస్తుంటా. లెగ్ స్పిన్నర్ వేసే బంతులపై నాకు ఓ అంచనా ఉంది. భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు 20 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండేందుకు ప్రయత్నించాలి. ఎవరో ఒక బౌలర్‌ను లక్ష్యం చేసుకోవాలి. ఇన్నింగ్స్‌పై సూర్యకుమార్ యాదవ్‌తో మాట్లాడా. లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా బౌలింగ్‌ను ఎటాక్ చేయమని చెప్పాడు’ అని తెలిపాడు .
Also Read: Rohit Sharma Daughter: మా డాడీ ఇంకో నెలలో నవ్వుతాడు.. సమైరా వీడియో వైరల్!
‘ఆస్ట్రేలియా నిర్దేశించిన 209 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టాప్ ఆర్డర్ ఎక్కువ రన్స్ చేయాలి. అప్పుడే తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భావించా. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోవడంతో సూర్యతో భాగస్వామ్యం నిర్మించడం చాలా కీలకంగా మారింది. ఐపీఎల్‌లో మేమిద్దరం కలిసి ఆడిన అనుభవం పనికొచ్చింది. మా మధ్య కమ్యూనికేషన్ అద్భుతం. విశాఖ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా లేదు. రవి బిష్ణోయ్ ఎక్కువగా పరుగులు సమర్పించినా.. ఇబ్బందేం లేదు. ఎందుకంటే.. ఇలాంటి వికెట్‌పై బౌలింగ్ చేయడం కష్టమే. జోష్ ఇంగ్లిస్ ఆట చూశాక బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలంగా ఉందనిపించింది. చివర్లో రింకు సింగ్ ఫినిషింగ్ బాగుంది. ఐపీఎల్‌లోని దూకుడు ఆసీస్‌పైనా కొనసాగించాడు’ అని ఇషాన్ కిషన్ ప్రశంసించాడు.