తాను చాలా ప్రాక్టికల్ అని, జరిగిన ప్రతి సంఘటన గురించి బాధపడితే ఉపయోగం లేదని టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అన్నాడు. తాను హార్దిక్ పాండ్యాతో చాలా సమయం గడిపానని, కష్టకాలంలో తనకు అండగా నిలిచాడన్నాడు. మ్యాచులో త్వరగా ఔటైతే దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదన్నాడు. తనకు మరలా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలనే కోరిక ఉందని ఇషాన్ చెప్పాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాలో పర్యటించే భారత్-ఏ జట్టుకు ఎంపికైన ఇషాన్.. సత్తా చాటి తిరిగి సీనియర్ జట్టులో స్థానం సంపాదించాలనే పట్టుదలతో ఉన్నాడు.
గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా ఇషాన్ కిషన్ విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం రంజీ ట్రోఫీ ఆడకుండా.. ఐపీఎల్ 2024కి సన్నద్ధం అయ్యాడు. దాంతో బీసీసీఐ ఆగ్రహానికి గురైన ఇషాన్.. సెంట్రల్ కాంట్రాక్టును కూడా కోల్పోయాడు. చివరకు దిగొచ్చిన ఇషాన్.. దేశవాళీ టోర్నీలు ఆడుతున్నాడు. గత కొన్ని నెలల్లో మళ్లీ గాడినపడ్డాడు. దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీలో సెంచరీలు చేసి ఫామ్ సాధించాడు. చాలా కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్.. ఇప్పుడు తనకు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలనే కోరిక ఉందని తెలిపాడు. నవంబర్ 2023లో ఆస్ట్రేలియాపై భారత్ తరఫున ఇషాన్ చివరి మ్యాచ్ ఆడాడు.
Also Read: WTC 2024-25: మూడో టెస్టులోనూ ఓడితే.. ఫైనల్ ఆశలు గల్లంతయినట్లే!
‘చిన్న వయసులో నన్ను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది. చాలా కాలంగా హార్దిక్ పాండ్య నా స్నేహితుడు. అతడు ఎలా ఆలోచిస్తాడో నాకు తెలుసు. నేను గొప్ప ఆటగాడిగా ఎదగాలని హార్దిక్ కోరుకుంటాడు. నాతో తన ఆలోచనలను పంచుకుంటాడు. హార్దిక్ చాలా ప్రాక్టికల్. ఇప్పుడు నేను కూడా ప్రాక్టికల్‌గా ఉంటున్నా. త్వరగా ఔటైతే దాని గురించి ఆలోచించట్లేదు. తర్వాతి మ్యాచ్‌లో ఎలా ఆడతానో అని అనుకోవట్లేదు. ప్రస్తుతం రన్స్ చేస్తున్నా. నాకు అవకాశం దొరికినప్పుడల్లా బౌలర్లను చితక్కొడతానని నాకు తెలుసు. అంతర్జాతీయ మ్యాచ్ ఆడి చాలా కాలమైంది. మరలా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలనే కోరిక ఉంది. కచ్చితంగా రాణిస్తాననే నమ్మకం ఉంది’ అని ఇషాన్ చెప్పాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 2 టెస్టులు, 27 వన్డేలు, 32 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు.