Site icon NTV Telugu

Ishan Kishan Match Fixing: మనోడు కాదు, పగోడు.. ఇషాన్ ఇంకా ముంబై ఇండియన్స్‌కే ఆడుతున్నాడు!

Ishan Kishan Match Fixing

Ishan Kishan Match Fixing

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) స్టార్ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ పేలవ ఫామ్‌ కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఓ సెంచరీ తప్పితే.. మరో మంచి ఇన్నింగ్స్ ఆడింది లేదు. ఎస్‌ఆర్‌హెచ్‌కు కీలకమైన మ్యాచ్ ముంబై ఇండియన్స్‌పై కూడా ఇషాన్‌ పూర్తిగా నిరాశపరిచాడు. బుధవారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నాలుగు బంతులు ఆడి.. ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇషాన్ అవుట్ అవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ట్రావిస్‌ హెడ్‌ (0) అవుట్ అనంతరం ఇషాన్‌ కిషన్‌ క్రీజులోకి వచ్చాడు. దీపక్ చహర్ మూడో ఓవర్ వేయగా.. మొదటి బంతి లెగ్‌ సైడ్‌ వెళ్లింది. బంతిని ఫైన్‌ లెగ్‌ దిశగా ఆడేందుకు ఇషాన్‌ ప్రయత్నించగా.. బంతి కీపర్ రికిల్‌టన్‌ చేతుల్లో పడింది. ఇటు బౌలర్, అటు కీపర్‌తో సహా ముంబై ప్లేయర్స్ ఎవరూ ఔటని అప్పీల్‌ చేయలేదు. కానీ ఇషాన్‌ మాత్రం అవుట్ అని భావించి క్రీజును వీడాడు. ఇది గమనించి బౌలర్ అప్పీల్ చేయగా.. అంపైర్‌ వైడ్‌ ఇవ్వాలా, ఔట్‌ ఇవ్వాలా అనే సంశయంలో చివరికి వేలు పైకెత్తాడు. రీప్లేలో మాత్రం గ్లవ్, బ్యాట్‌ను బంతి తాకనేలేదని తేలింది. ఇదంతా చూసి కాసేపు ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు. ఫాన్స్ అందరూ అయోమయంలో పడిపోయారు. ఇషాన్ మాత్రం వెళ్లి డగౌట్‌లో కూర్చున్నాడు.

Also Read: Rohit Sharma: టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ అరుదైన రికార్డు!

ప్రస్తుతం ఇషాన్ కిషన్ వికెట్ విషయంలో పెను వివాదం చెలరేగింది. మ్యాచ్ ఫిక్సింగ్ గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇషాన్ కిషన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో గతంలో నీతా అంబానీతో కలిసి దిగిన ఫొటోస్ వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్‌ఆర్‌హెచ్‌ ఫాన్స్ అయితే ఇషాన్‌పై మండిపడుతున్నారు. ‘మనోడు కాదు, పగోడు’, ‘ఇషాన్ ఇంకా ముంబై ఇండియన్స్‌కే ఆడుతున్నాడు’, ‘ముంబై ఇండియన్స్‌కు ఇషాన్ 12వ ఆటగాడిగా ఆడుతున్నాడు’ , ‘ఇషాన్ పక్కాగా మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version