NTV Telugu Site icon

Irugu Porugu: అరవై ఏళ్ళ ‘ఇరుగు-పొరుగు’

Irugu Porugu

Irugu Porugu

ఈ రోజుల్లో అయితే స్టార్ హీరోస్ తమ చిత్రాలను విడుదల చేయడంలో ఎంతో శ్రద్ధ వహిస్తూ, తాము నటించిన ఒక చిత్రానికి మరో సినిమాకు గ్యాప్ ఉండేలా చూసుకొని మరీ విడుదల చేస్తున్నారు. ఆ రోజుల్లో అయితే నటించడం వరకే తమ బాధ్యత నిర్మాతలు వారి వెసలుబాటును చూసుకొని మరీ సినిమాలు విడుదల చేస్తారు అనే నమ్మకంతో హీరోలు నటించేవారు. అలా 1963లో యన్టీఆర్ నటించిన మల్టీస్టారర్ ‘శ్రీకృష్ణార్జున యుద్ధము’ వంటి పౌరాణికం విడుదలయిన రెండు రోజులకే ఆయన హీరోగా నటించిన సోషల్ మూవీ ‘ఇరుగు-పొరుగు’ చిత్రం రిలీజయింది. ఈ రెండు చిత్రాలు అరవై ఏళ్ళ క్రితం జనాన్ని అలరించాయి. ‘ఇరుగు-పొరుగు’ చిత్రం 1963 జనవరి 11న విడుదలయింది.

‘ఇరుగు-పొరుగు’ టైటిల్ ను బట్టే ఇది రెండు కుటుంబాల కథ అని ఇట్టే తెలిసి పోతుంది. ఇంతకూ ఈ కథ ఏమిటంటే – రచయిత అయిన విశ్వనాథమ్ కు రేసుల పిచ్చి ఉంటుంది. ఏదో ఒక రోజున షావుకారు కావాలన్నదే అతని ఆశ. తాగిన విశ్వనాథమ్ ఓ ప్రమాదానికి గురవుతాడు. తమ తండ్రిని వెదుకుతూ వెళ్ళిన ఆయన పిల్లలు జానీ, జిక్కి దారి తప్పిపోయి విడిపోతారు. విశ్వనాథం కూడా పిల్లలను వెదికిస్తాడు. పరంధామయ్య, సరస్వతమ్మ దంపతులకు జిక్కి దొరుకుతుంది. వారి వద్దే చిత్ర పేరుతో పెరిగి పెద్దవుతుంది. సుందరమ్ అనే మోటార్ వర్క్ షాప్ ఓనర్ కు దొరికిన జానీ, రాము అనే పేరుతో పెరిగి పెద్దవుతాడు. వినోద్ బాబు అనే ఆయన ఇంటిలో పరంధామయ్య చేరతాడు. వినోద్ బాబు భార్య చారులత, కొడుకు రవితో హాయిగా కాపురం చేసుకుంటూ ఉంటాడు. వారి పొరుగున చేరిన చిత్రకు, రవికి మధ్య ఆరంభంలో కలహాలు సాగుతాయి. తరువాత వారిద్దరూ ప్రేమలో పడతారు. సుందరమ్ కూతురు జయంతి, రామును ప్రేమిస్తుంది.

ఇది తెలిసిన సుందరమ్, రామును గెంటేస్తాడు. తన సోదరి కొడుకు డాక్టర్ ప్రసాద్ కు ఇచ్చి జయంతికి వివాహం చేయాలని నిశ్చయిస్తాడు. వినోద్ బాబు తన కొడుకు రవిని చిత్ర బుట్టలో వేసుకుందని పరంధామయ్యకు వార్నింగ్ ఇస్తాడు. సరస్వతమ్మ కూతురు చిత్రను ‘అనాథ’ అని తూలనాడుతుంది. అది తెలిసిన చిత్ర ఇల్లు విడిచిపోతుంది. పరంధామయ్య భార్యను చీవాట్లు పెడితే, ఆమె ఇంటిపై నుండి పడి చనిపోతుంది. పరంధామయ్య పిచ్చివాడు అవుతాడు. రవికి విషయాలు తెలుస్తాయి. రవి తండ్రి వినోద్ బాబు కూడా పశ్చాత్తాపం చెందుతాడు. డాక్టర్ ప్రసాద్ తన మరదలు వేరే అబ్బాయిని ప్రేమించిందని తెలుసుకొని, తన మేనమామ సుందరానికి నచ్చ చెబుతాడు. రాము, జయంతి ప్రేమకు ఆయన అంగీకరిస్తాడు. ఓ చోట రచయిత విశ్వనాథమ్ తన దర్శకత్వంలో నాటకం వేయిస్తూ ఉంటాడు. చివరకు ఆయన పిల్లలు చిత్ర, రాము కలుసుకుంటారు. పరంధామయ్య కూడా వారిని చేరుకుంటాడు. రవి-చిత్ర, రాము-జయంతి పెళ్ళిళ్ళతో కథ సుఖాంతమవుతుంది.

యన్టీఆర్ సరసన కృష్ణకుమారి నాయికగా నటించిన ఈ చిత్రంలో ఎమ్.బాలయ్య, గుమ్మడి, రేలంగి, నాగయ్య, సీయస్సార్, మిక్కిలినేని, శోభన్ బాబు, జానకి, సంధ్య, గిరిజ, ఇ.వి.సరోజ, ఎల్.విజయలక్ష్మి, నిర్మలమ్మ ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి కొండేపూడి లక్ష్మీనారాయణ రచన చేయగా, మాస్టర్ వేణు సంగీతం సమకూర్చారు. ఆరుద్ర, కొసరాజు పాటలు పలికించారు. ఇందులోని “నా మనసంతా తీసుకో…”, “కవ్వించేవు కవ్వించేవు…”, “మబ్బుల చాటున…”, “సన్నజాజి చెలిమి కోరి…” వంటి పాటలు అలరించాయి. ఈ చిత్రానికి ‘అమీ బరో హోబో’ అనే బెంగాలీ చిత్రం ఆధారం. చిలంకుర్తి విజయసారథి నిర్మించిన ఈ సినిమాకు ఐ.యన్.మూర్తి దర్శకత్వం వహించారు. ‘ఇరుగు-పొరుగు’ రిపీట్ రన్స్ లోనూ మంచి ఆదరణ చూరగొంది.

Show comments