ట్రంప్ బెదిరింపులు వేళ ఇరాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖాదేమీ హతమయ్యాడు. ఈ మేరకు మజీద్ ఖాదేమీ మరణాన్ని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ధృవీకరించినట్లుగా ప్రభుత్వ మీడియా పేర్కొంది.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, కీలక నేతలు హతమయ్యారు. అనంతరం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ ప్రభుత్వంలో ఉన్న అగ్ర నేతలంతా నేలరాలిపోయారు. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖాదేమీ హతమయ్యాడు.
ఇదిలా ఉంటే 48 గంటల్లో ఇరాన్ ఒప్పందం చేసుకోవాలని.. లేదంటే నరకం చూపిస్తామని ట్రంప్ బెదిరించారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే ఓ వైపు సైనిక చర్యలు, బెదిరింపులు కొనసాగుతుండగా.. ఇంకోవైపు దౌత్యపరమైన ప్రయత్నాలు ఏకకాలంలో జరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా, ఇరాన్‌ల మధ్య తక్షణ కాల్పుల విరమణను ప్రతిపాదిస్తూ పాకిస్థాన్ ‘ఇస్లామాబాద్ ఒప్పందం’ ముసాయిదాను రూపొందించింది. తుది పరిష్కారాలు 15-20 రోజుల్లో కుదురుతాయని అంచనా వేసింది. చైనా, ప్రాంతీయ మధ్యవర్తులు కూడా పాలుపంచుకుంటున్న ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్… అమెరికా, ఇరాన్ అధికారులతో రాత్రంతా చర్చలు జరిపారు. కానీ ఇరాన్ మాత్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.
