NTV Telugu Site icon

IPL Retention 2025: అభిమానులకు శుభవార్త.. మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ!

Virat Kohli Rcb Captain

Virat Kohli Rcb Captain

ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనుంది. ప్రాంఛైజీలు తమ రిటెన్షన్‌ జాబితాను అక్టోబర్‌ 31 లోపు సమర్పించాల్సి ఉంది. తుది గడువుకు మరికొన్ని గంటలే ఉన్న నేపథ్యంలో అభిమానుల దృష్టి అంతా రిటెన్షన్‌ జాబితాపైనే ఉంది. ఏ ప్రాంచైజీ ఏయే ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటుంది, ఎవరిని వేలంలోకి వదిలేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తుది గడువు సమీపిస్తున్నా కొద్దీ.. స్టార్‌ ఆటగాళ్ల చుట్టూ పలు ఆసక్తికర కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ మరోసారి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్‌గా బాధ్యతలు అందుకోనున్నాడట.

ఫాఫ్ డుప్లెసిస్‌ను రిటైన్ చేసుకోవడానికి ఆర్‌సీబీ ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. 2022 సీజన్ నుంచి బెంగళూరును డుప్లెసిస్ నడిపిస్తున్నాడు. గత మూడు సీజన్లలో రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు చేర్చాడు కానీ.. 17 ఏళ్లుగా ఎదురుచూస్తున్న టైటిల్ కలను మాత్రం తీర్చలేకపోయాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ లూసియా కింగ్స్‌ను విజేతగా నిలబెట్టిన డుప్లెసిస్‌కు మరో అవకాశం ఇవ్వాలని చూసినా.. ఆర్‌సీబీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని మరో మూడేళ్లకు తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని యూటర్న్ తీసుకుంది.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ.. ఇలా అయితే కష్టమే: హాగ్

ఫాఫ్ డుప్లెసిస్‌ను రిటెయిన్‌ చేసుకోకపోతే బెంగళూరుకు కొత్త కెప్టెన్‌ రావడం ఖాయం. గతంలో జట్టును నడిపించిన విరాట్ కోహ్లీ పేరే కెప్టెన్ రేసులో ప్రధానంగా వినిపిస్తోంది. కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవాలని వ్యూహాలు సిద్ధం చేసినా.. లక్నో ఆర్‌టీఎమ్ ఉపయోగించే అవకాశం ఉండటం, వేలంలో అతడికి భారీ డిమాండ్ ఉండే అవకాశాల నేపథ్యంలో బ్యాకప్ ప్లాన్ సిద్ధం చేసిందని తెలుస్తోంది. 2013 నుంచి 2021 వరకూ విరాట్ ఆర్‌సీబీకి సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే టైటిల్‌ మాత్రం అందించలేకపోయాడు. విరాట్‌ కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో డుప్లెసిస్‌ బాధ్యతలు అందుకున్నాడు. చూడాలి మరి ఆర్‌సీబీకి ఎవరు కెప్టెన్ అవుతారో.