IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్‌కు ఫుల్ స్టాప్..?

Paper Statement

Paper Statement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటే క్రికెట్ ఒక్కటే కాదు.. అంతకు మించిన వినోదం, డ్రామా, సరికొత్త ట్రెండ్‌లకు కేరాఫ్ అడ్రస్. మైదానంలో వికెట్ తీసినప్పుడో, సెంచరీ కొట్టినప్పుడో ఆటగాళ్లు రకరకాల శైలిలో సంబరాలు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే, ఈ సీజన్‌లో సరికొత్తగా దూసుకొచ్చిన ‘పేపర్ నోట్’ సెలబ్రేషన్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. జేబులోంచి ఒక కాగితం ముక్కను తీసి కెమెరా ముందు ప్రదర్శించే ఈ ట్రెండ్‌పై దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు.

అసలేం జరిగిందంటే?
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పేసర్ ఆకాష్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతను తన జేబులోంచి ఒక పేపర్ నోట్ తీసి ప్రదర్శించాడు. దానిపై “అక్కీ ఆన్ ఫైర్ – టీ20 మ్యాచ్‌ల్లో వికెట్లు ఎలా తీయాలో ఆకాష్‌కు తెలుసు” అని రాసి ఉంది. ఇది తనకు ప్రేరణనిస్తుందని ఆకాష్ చెప్పినప్పటికీ, ఈ విజువల్స్ వైరల్ అయిన కొద్దిసేపటికే డేల్ స్టెయిన్ ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చారు. “ఆ కాగితాలను పక్కన పెట్టే సమయం వచ్చింది. ఇది ఏమాత్రం ట్రెండింగ్ కాదు. నిజం చెప్పాలంటే ఇది ఎప్పుడూ ట్రెండ్ అవ్వలేదు” అంటూ స్టెయిన్ మండిపడ్డారు.

గతంలో ఈ పేపర్ చూపించింది ఎవరంటే..?
ఈ విచిత్రమైన ట్రెండ్ ఈ రోజే మొదలైంది కాదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్‌పై సెంచరీ చేసినప్పుడు మొదటిసారి ఇలాంటి సెలబ్రేషన్ చేశాడు. అతని పేపర్ నోట్‌పై “ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం” అని రాసి ఉంది. ముంబై ఇండియన్స్ బౌలర్ రఘు శర్మ లక్నోపై తన కెరీర్‌లో మొదటి ఐపీఎల్ వికెట్ తీసినప్పుడు జేబులోంచి నోట్ తీసి సంబరాలు చేసుకున్నాడు. లక్నోపై కేవలం 13 బంతుల్లోనే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన చెన్నై బ్యాటర్ ఉర్విల్ పటేల్ కూడా ఈ ట్రెండ్‌ను ఫాలో అయ్యాడు. అతని పేపర్‌పై “ఇది నీ కోసమే, నాన్న” అని రాసి ఉన్న ఎమోషనల్ మెసేజ్ నెటిజన్లను ఆకట్టుకుంది.

ఒకరికొకరు స్ఫూర్తిగా, భావోద్వేగాలను పంచుకోవడానికి ఆటగాళ్లు ఈ పేపర్ సెలబ్రేషన్‌ను వాడుతుంటే, డేల్ స్టెయిన్ మాత్రం ఇది క్రికెట్‌లో అనవసరమైన హంగామా అని తేల్చిచెప్పారు. వికెట్లు, పరుగులు, ఆటలోని ప్రదర్శనలు మాత్రమే మైదానంలో నిలుస్తాయని.. ఇలాంటి కాగితపు ముక్కలను జేబులోనే ఉంచేస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. స్టెయిన్ చేసిన ఈ వ్యాఖ్యలతో ప్రస్తుతం ఐపీఎల్ అభిమానుల్లో ఈ ట్రెండ్‌పై భిన్నమైన చర్చ నడుస్తోంది.