Site icon NTV Telugu

IPL 2026: ఐపీఎల్ వేలానికి ముందే.. పంజాబ్ కింగ్స్‌లో భారీ మార్పు!

Pbks 2025 Ipl Final

Pbks 2025 Ipl Final

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 కోసం మినీ వేలం డిసెంబర్ 13-15 మధ్య జరిగే అవకాశం ఉంది. అన్ని జట్లు నవంబర్ 15 లోపు తమ రిటెన్షన్, రిలీజ్ లిస్టులను సమర్పించాలి. ఐపీఎల్ వేలానికి ముందు కొన్ని జట్లు ఆటగాళ్లను విడుదల చేయడమే కాకుండా, సహాయక సిబ్బందిలో కూడా మార్పులు చేస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ ఇటీవల కేన్ విలియమ్సన్‌ను వ్యూహాత్మక సలహాదారుగా నియమించింది. తాజాగా పంజాబ్ కింగ్స్ కూడా తమ సహాయక సిబ్బందిలో కీలక మార్పు చేసింది.

సాయిరాజ్ బహుతులేను పంజాబ్ కింగ్స్ తన సహాయక సిబ్బందిలో చేర్చుకుంది. సునీల్ జోషి స్థానంలో బహుతులే జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. బహుతులే అనుభవజ్ఞుడైన కోచ్. గతంలో రాజస్థాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశారు. బెంగాల్, కేరళ, విదర్భ, గుజరాత్ వంటి జట్లకు కూడా కోచింగ్ ఇచ్చారు. యువ బౌలర్లను తయారు చేయడంలో, టెక్నిక్‌ను మెరుగుపరచడంలో బహుతులే సిద్దహస్తులు. ‘పంజాబ్ కింగ్స్‌లో చేరడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది. విభిన్నమైన క్రికెట్ ఆడుతోంది. ప్లేయర్స్ మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఆటగాళ్లతో కలిసి పనిచేయడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను’ అని బహుతులే చెప్పారు.

Also Read: Adi Srinivas: కేటీఆర్.. ఎన్ని పెడ‌బొబ్బ‌లు పెట్టినా ఏం ఉప‌యోగం లేదు!

పంజాబ్ కింగ్స్ సీఈఓ సతీష్ మీనన్ మాట్లాడుతూ… ‘మా జట్టుకు సునీల్ జోషి చేసిన కృషికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సాయిరాజ్ బహుతులే మా కోచింగ్ సిబ్బందిలో చేరడం చాలా సంతోషంగా ఉంది. అతని దేశీయ క్రికెట్ అనుభవం, బౌలర్లతో పనిచేయడంపై అవగాహన జట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది’ అని అన్నారు. బహుతులే ఇప్పుడు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ నేతృత్వంలోని కోచింగ్ గ్రూప్‌లో భాగం అయ్యారు. ఐపీఎల్ 2025లో శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ ఫైనల్‌కు చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Exit mobile version