ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ వేదిక గురించి బీసీసీఐ ఇప్పటికే సమాచారం ఇచ్చినా.. తలపడే టీమ్స్ గురించి మాత్రం చెప్పలేదు. తాజా క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య లీగ్ మొదటి మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ సొంత నగరమైన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మొదటి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుంది.
గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మధ్యాహ్నం 3.30కి ఆరంభం కానుంది. ఐపీఎల్ 2025 మ్యాచ్‌ల తేదీలను బీసీసీఐ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ముఖ్యమైన మ్యాచ్‌ల తేదీల గురించి ఆయా జట్లకు బీసీసీఐ అనధికారికంగా తెలియజేసినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం మే 25న ఈడెన్ గార్డెన్స్ మైదానం ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
ముంబైలో జనవరి 12న ప్రత్యేక సర్వసభ్య సమావేశం అనంతరం మార్చి 23న ఐపీఎల్ 2025 ప్రారంభమవుతుందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా సూచప్రాయంగా చెప్పారు. అయితే బ్రాడ్‌కాస్టర్‌ల అభ్యర్థన మేరకు బీసీసీఐ తేదీలను సవరించినట్లు తేలింది. ఒకటి, రెండు రోజుల్లో పూర్తి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. కోల్‌కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, లక్నో, ముల్లన్‌పూర్, ఢిల్లీ, జైపూర్‌లతో పాటు ఈ సీజన్ మ్యాచ్‌లు గౌహతి మరియు ధర్మశాలలో కూడా జరుగుతాయి. గత సంవత్సరం మాదిరిగానే ధర్మశాల రెండు గేమ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ హైదరాబాద్‌లో.. క్వాలిఫైయర్ 2, ఫైనల్ కోల్‌కతాలో జరిగే అవకాశాలు ఉన్నాయి.