NTV Telugu Site icon

Shashank Singh: అందుకే శ్రేయస్‌కు స్ట్రైక్ ఇవ్వలేదు.. అసలు విషయం చెప్పేసిన శశాంక్‌ సింగ్!

Shashank Singh

Shashank Singh

ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్ సెంచరీ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మూడో స్థానంలో దిగిన శ్రేయస్‌.. ఫోర్లు, సిక్సులతో చెలరేగాడు. ఈ క్రమంలో 17 ఓవర్‌ పూర్తయ్యేసరికి 90 పరుగులకు చేరుకున్నాడు. అప్పటికి ఇంకా 3 ఓవర్లు ఉండడంతో.. శ్రేయస్‌ సెంచరీ లాంఛనమే అని అందరూ అనుకున్నారు. అయితే తర్వాతి 2 ఓవర్లలో 3 బంతులే ఆడి 7 పరుగులు మాత్రమే చేశాడు. శశాంక్‌ సింగ్ ఎక్కువగా స్ట్రైకింగ్‌ తీసుకోవడంతో శ్రేయస్‌ సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచాడు.

మ్యాచ్‌ అనంతరం శ్రేయస్‌ అయ్యర్ సెంచరీ మిస్‌ కావడంపై శశాంక్‌ సింగ్ స్పందించాడు. శ్రేయస్ సూచన మేరకే తాను ఎక్కువగా స్ట్రైకింగ్‌ తీసుకున్నానని చెప్పాడు. ‘శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. డగౌట్ నుంచి శ్రేయస్ ఆట చూస్తూ ఎంజాయ్ చేశా. నేను క్రీజులోకి రాగానే శ్రేయస్ నాకు ఒక్కటే చెప్పాడు. నా సెంచరీ గురించి ఆలోచించకుండా దూకుడుగా ఆడమని చెప్పాడు. సెంచరీ కంటే జట్టు స్కోర్ ముఖ్యమన్నాడు. ఆ మాటలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. బౌండరీలు బాదగలనని నాపై నమ్మకం ఉంది. ఈ స్థానంలో ఎవరు బ్యాటింగ్‌ చేసినా హిట్టింగ్ చేయాల్సిందే. ఒక్కోసారి కనెక్ట్‌ కాదు. నా బలం ఏంటో తెలుసు. దానిపై మాత్రమే నేను దృష్టి పెట్టా. స్వేచ్ఛగా ఆడేలా నాకు అండగా నిలిచిన టీమ్‌మేనేజ్‌మెంట్కు దన్యవాదాలు’ అని శశాంక్‌ చెప్పుకొచ్చాడు.

Also Read: Shreyas Iyer: నాకు మంచి ఊపొచ్చింది.. ఈ జోరును కొనసాగిస్తాం!

ఈ మ్యాచ్‌లో శశాంక్ సింగ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో శ్రేయస్‌ అయ్యర్‌కు ఒక్క బంతీ ఆడే అవకాశం ఇవ్వలేదు. 5 ఫోర్లు బాది 23 పరుగులు రాబట్టాడు. శశాంక్ మెరుపులతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఆఖరి ఓవర్‌కు ముందే 97 పరుగులు చేసిన శ్రేయస్.. మూడంకెల స్కోర్ అందుకోలేకపోయాడు.