ఐపీఎల్ 2025లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. ఈ రోజు గౌహతి వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో దారుణ ఓటమి ఎదుర్కొన్న కేకేఆర్.. ఆర్ఆర్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. మరోవైపు హైదరాబాద్ చేతిలో 44 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓడింది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
కోల్‌కతా, రాజస్థాన్ జట్ల హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్,కోల్‌కతా మధ్య 30 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో రాజస్థాన్ 14, కోల్‌కతా 14 మ్యాచ్‌ల్లో గెలిచింది. 2 మ్యాచ్‌లు టై అయ్యాయి. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో నాలుగు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు రెండు సార్లు.. లక్ష్యాన్ని ఛేదించిన జట్లు ఒకేసారి గెలిచాయి. మరో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. ఈ మైదానంలో అత్యధిక స్కోరు 199.
కోల్‌కతా ఆరంభ మ్యాచ్ ఓడినప్పటికీ ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఐపీఎల్‌లోనే ఆ జట్టు మూడవ అత్యంత విజయవంతమైన జట్టు. 2012లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ తొలి ట్రోఫీని గెలుచుకుంది. 2014లోనూ గంభీర్ కెప్టెన్సీలో రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. చాలా గ్యాప్ తర్వాత గతేడాది మూడోసారి టైటిల్ గెలిచింది. విశేషమేంటంటే ఆ సమయంలోను గంభీర్ ఆ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆర్ఆర్ విషయానికి వస్తే..షేన్ వార్న్ కెప్టెన్సీలో తొలి ఐపీఎల్ ట్రోఫీని లిఫ్ట్ చేసింది. కానీ ఆ తర్వాత రాజస్థాన్ జట్టుకు టైటిల్ అందని ద్రాక్షగా మిగిలింది. 2022లో సంజు సామ్సన్ కెప్టెన్సీలో రాజస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది కానీ గుజరాత్ చేతిలో ఓడిపోయింది.
తుది జట్లు (అంచనా):
రాజస్థాన్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, నితీష్ రానా, ధ్రువ్ జురేల్ (కీపర్), షిమ్రాన్ హెట్మేయర్, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, మహీష్ తీక్షణ, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ, ఫజల్ హక్ ఫారూఖీ.
కోల్‌కతా: క్వింటన్ డికాక్ (కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సర్/అన్రిచ్ నార్ట్జే, వరుణ్ చక్రవర్తి.