NTV Telugu Site icon

Rajasthan Royals Captain: రాజస్థాన్‌ రాయల్స్‌కు భారీ షాక్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?

Rajasthan Royals

Rajasthan Royals

ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుకు షాక్ తగిలింది. కెప్టెన్ సంజు శాంసన్ ఈ ఎడిషన్‌లో రాజస్థాన్ ఆడే తొలి మూడు మ్యాచ్‌లకు సారథ్యం వహించడని ఆర్ఆర్ ఎక్స్ వేదికగా తెలిపింది. ఫిట్‌నెస్‌ సమస్య కారణంగా కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గా మాత్రమే ఆడతాడని పేర్కొంది. శాంసన్ స్థానంలో స్టార్ బ్యాటర్ రియాన్ పరాగ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

‘ఐపీఎల్ 2025లో సంజు శాంసన్ మొదటి మూడు మ్యాచ్‌లలో బ్యాటర్‌గా మాత్రమే ఆడతాడు. ఫిట్‌నెస్‌ కారణంగా కీపింగ్ మరియు ఫీల్డింగ్ విధులు నిర్వర్తించడు. రాజస్థాన్ రాయల్స్ ఆడే తొలి మూడు మ్యాచ్‌లలో రియాన్ పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.శాంసన్ పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధించాక కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపడతాడు’ అని రాజస్థాన్ రాయల్స్ పేర్కొంది. ఐపీఎల్ 18వ ఎడిషన్ మార్చి 22 నుండి ఆరంభం కానుంది. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య లీగ్ మొదటి మ్యాచ్ జరగనుంది. మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.

ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సంజు శాంసన్‌కు గాయం అయింది. గాయం కారణంగా మిగిలిన సిరీస్‌కు దూరమయ్యాడు. శస్త్రచికిత్స అనంతరం కోలుకుని. తిరిగి ప్రాక్టీస్ మొదలెట్టాడు. మార్చి 26, మార్చి 30 తేదీల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ తలపడనుంది. 2008లో తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న రాయల్స్.. గత సంవత్సరం పట్టికలో మూడవ స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఎలిమినేటర్‌లో ఓడిపోవడంతో ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.