ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేలవ ఫామ్ ఐపీఎల్‌లో కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగి.. 10 మ్యాచులలో 52 పరుగులు మాత్రమే చేశాడు. గతేడాది తీవ్రంగా నిరాశపర్చిన మ్యాక్సీని ఆర్సీబీ వేలంలోకి వదిలేయగా.. పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. సీజన్, ఫ్రాంచైజీ మారినా మ్యాక్స్‌వెల్ ప్రదర్శనలో మాత్రం మార్పు లేదు. ఐపీఎల్ 2025లో మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
గుజరాత్ టైటాన్స్ బౌలర్ సాయి కిశోర్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడేందుకు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రయత్నించాడు. బంతి బ్యాట్‌కు కనెక్ట్ కాకుండా.. నడుముకు తాకింది. గుజరాత్ ఆటగాళ్లు వెంటనే అప్పీలు చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చేశాడు. నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌తో చర్చించకుండానే మ్యాక్స్‌వెల్ పెవిలియన్‌కు వెళ్ళిపోయాడు. రిప్లేలో మాత్రం బంతి వికెట్లపై నుంచి వెళ్లింది. దాంతో పంజాబ్ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ‘మ్యాక్సీ డీఆర్‌ఎస్ తీసుకొని ఉంటే అవుట్ అయ్యేవాడు కాదు’, ‘అయ్యో మ్యాక్స్‌వెల్.. ఎంతపనాయే’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Top Headlines @9AM: టాప్ న్యూస్!
గోల్డెన్ డకౌటైన గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా మ్యాక్సీ రెకార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్‌లో 19 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచుకు ముందు వరకు రోహిత్ శర్మ (18), దినేష్ కార్తీక్ (18)తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. ఈ జాబితాలో పీయూష్ చావ్లా (16), సునీల్ నరైన్ (16)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.