NTV Telugu Site icon

MI vs GT: నేడు ఎలిమినేటర్‌ మ్యాచ్.. క్వాలిఫయర్‌-2లో తలపడేదెవరో?

Ipl 2025 Eliminator Gt Vs Mi

Ipl 2025 Eliminator Gt Vs Mi

ఐపీఎల్ 2025లో నేడు మరో ఆసక్తికర సమరం జరగనుంది. ఎలిమినేటర్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ముల్లాన్‌పుర్‌లో రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2లో పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. ఓడిన టీమ్ లీగ్‌ నుంచి నిష్క్రమిస్తుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్ కాబట్టి ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. గుజరాత్‌, ముంబై జట్లలో స్టార్స్ ఉన్నారు కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.

లీగ్ ఆరంభం నుంచి గుజరాత్‌ టైటాన్స్ చక్కని ప్రదర్శనతో ముందంజ వేసింది. అయితే ప్లేఆఫ్స్‌ ముంగిట రెండు వరుస ఓటములతో అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 5 పరాజయాలతో 18 పాయింట్లు సాధించింది. ఇప్పటివరకు సాయి సుదర్శన్, శుభ్‌మన్‌ గిల్, జోస్ బట్లర్‌లు భారీగా పరుగులు చేశారు. అయితే జాతీయ జట్టుకు ఆడేందుకు బట్లర్‌ స్వదేశానికి వెళ్లిపోవడం టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ. గిల్, సుదర్శన్‌ ప్రదర్శనపైనే గుజరాత్ భవితవ్యం ఆధారపడి ఉంది. రూథర్‌ఫోర్డ్, షారుక్‌ ఖాన్, రాహుల్‌ తెవాటియా సత్తాచాటాల్సిన సమయం ఇదే. పేసర్‌ సిరాజ్ వికెట్లు పడగొట్టడం టైటాన్స్‌కు కలిసొచ్చే అంశం. అర్షద్‌ ఖాన్‌, ప్రసిద్ధ్‌కృష్ణ చెలరేగాల్సి ఉంది.

మరోవైపు ఆరంభంను పేలవంగా మొదలెట్టిన యంబై అనూహ్యంగా రేసులోకి వచ్చింది. 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 6 పరాజయాలతో 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. విదేశీ ఆటగాళ్లు వీడడం ముంబైకి ఇబ్బందికరంగా మారింది. రికిల్‌టన్‌, విల్‌ జాక్స్‌ స్వదేశాలకు వెళ్లిపోయారు. దాంతో రోహిత్‌తో కలిసి జానీ బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశముంది. సూర్యకుమార్‌ యాదవ్‌ ఫామ్‌ గొప్ప సానుకూలాంశం. హార్దిక్, తిలక్ సత్తాచాటితే తిరుగుండదు. బుమ్రా, బౌల్ట్, అశ్విని కుమార్, దీపక్‌ చహర్, హార్దిక్‌ పాండ్య, శాంట్నర్‌లతో ముంబై బౌలింగ్‌ పటిష్టంగా ఉంది. స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్ ఆరంభం కానుంది.