NTV Telugu Site icon

Vijay Shankar: శంకరన్నా.. అందరూ నవ్వుకుంటున్నారే!

Vijay Shankar Trolls

Vijay Shankar Trolls

ఐపీఎల్‌ 2025లో మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ పరాజయాలను ఖాతాలో వేసుకుంది. ఈ మొదటి మ్యాచ్‌లో ముంబైపై గెలిచిన చెన్నై.. బెంగళూరు, రాజస్థాన్‌, ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. తాజాగా ఢిల్లీ నిర్ధేశించిన లక్ష్యం ఛేదించదగినదే అయినా.. చెన్నై 25 పరుగుల తేడాతో ఓడింది. శనివారం చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదట ఢిల్లీ 6 వికెట్లకు 183 పరుగులు చేసింది. ఛేదనలో చెన్నై 5 వికెట్లకు 158 పరుగులే చేసింది. విజయ్‌ శంకర్‌ (69 నాటౌట్‌; 54 బంతుల్లో 5×4, 1×6) జిడ్డు బ్యాటింగ్ చెన్నై ఓటమికి కారణమైంది. దాంతో అతడిపై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చెన్నై ఛేదనలో రెండో ఓవర్లోనే ఓపెనర్ రచిన్‌ రవీంద్ర (3) అవుట్ అయ్యాడు. ఆపై వరుస విరామాల్లో రుతురాజ్‌ గైక్వాడ్‌ (5), డెవాన్‌ కాన్వే (13), శివమ్‌ దూబె (18), రవీంద్ర జడేజా (2) పెవిలియన్‌కు చేరారు. 10.4 ఓవర్లకు 74/5తో చెన్నై కష్టాల్లో పడింది. ఈ సమయంలో విజయ్‌ శంకర్‌, ఎంఎస్ ధోనీ జట్టును ఆదుకున్నారు. అయితే శంకర్‌ జిడ్డు బ్యాటింగ్‌తో చేయాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయింది. సమీకరణం 18 బంతుల్లో 67 పరుగులతో అసాధ్యంగా మారింది. ఇద్దరూ ఝళిపించలేకపోవడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. దాంతో సోషల్ మీడియాలో శంకర్‌పై చెన్నై ఫాన్స్ సహా నెటిజెన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.

‘విజయ్ శంకర్ జిడ్డు బ్యాటింగే చెన్నై ఓటమికి కారణం’, ‘శంకరన్నా.. ఇది టెస్ట్ మ్యాచ్ కాదు’, ‘ఈ హాఫ్ సెంచరీ ఎందుకు అసలు’, ‘ప్రతి ఐపీఎల్‌ సీజన్‌లో శంకర్‌ది ఇదే తంతు’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జిడ్డు బ్యాటింగ్ కారణంగానే శంకర్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ఢిల్లీ ప్లేయర్స్ వదిలేసారని, ఎల్బీడబ్ల్యూ అవకాశం ఉన్నా రివ్యూ తీసుకోలేదని ఫాన్స్ మండిపడుతున్నారు. శంకర్ క్యాచ్ డ్రాప్ అయ్యాక ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ నవ్వుకోవడంకు చెన్నై ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ భారత జట్టులో అవకాశం దక్కించుకున్న శంకర్.. ఆ మెగా టోర్నీలో కూడా విమర్శల పాలైన విషయం తెలిసిందే. అప్పటినుంచి అతడు భారత జట్టు వైపే చూడలేదు.