ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. గతేడాది ఆర్సీబీ తరుపున చెత్త ప్రదర్శన చేసిన మ్యాక్సీని ఆ జట్టు వేలంలోకి వదిలేసింది. దీంతో రూ.11 కోట్ల ధర నుంచి రూ.4 కోట్లకు పడిపోయాడు. ఐపీఎల్ 2025 వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని 4 కోట్లకే దక్కించుకుంది. అయితే ఈ సీజన్లోనూ మాక్స్‌వెల్ ప్రదర్శనలో మార్పు లేదు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయ్యాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక సార్లు (19) డకౌట్ అయిన ఆటగాడిగా మాక్సీ రికార్డు సృష్టించాడు.
ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన స్టార్ ఆటగాళ్ల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 54వ స్థానంలో ఉన్నాడు. ధోనీ 265 మ్యాచ్‌లు ఆడి 137.46 స్ట్రైక్ రేట్, 39.12 సగటుతో 5243 పరుగులు చేశాడు. అయితే మహీ తన ఐపీఎల్ కెరీర్లో 6 సార్లు మాత్రమే డకౌట్ అయ్యాడన్న విషయం చాలా మందికి తెలిసి ఉండదు. ఐపీఎల్ 2025లో ధోనీ ఆట కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. గత మ్యాచ్‌లో మహీకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
ఇక ఐపీఎల్‌లో అత్యధికంగా సున్నాకే ఔటైన జాబితాలో ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. రోహిత్ 258 మ్యాచ్‌ల్లో 131.03 స్ట్రైక్ రేట్, 29.58 సగటుతో 6628 పరుగులు చేశాడు. అయితే హిట్‌మ్యాన్ ఐపీఎల్‌లో 18 సార్లు డకౌట్ అయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 10 సార్లు డకౌట్ అయ్యాడు. కోహ్లీ 253 మ్యాచ్‌లు ఆడి 132.15 స్ట్రైక్ రేట్, 38.95 సగటుతో 8063 పరుగులు చేశాడు.