NTV Telugu Site icon

IPL 2024: డబ్బు కోసమే ఐపీఎల్‌ ఆడటం సరికాదు.. హార్దిక్ పాండ్యాపై భారత మాజీ పేసర్ ఫైర్!

Hardik Pandya Mi

Hardik Pandya Mi

Praveen Kumar Slams on Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మార్చి 22న ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ సీజన్ ద్వారా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా ముంబై జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డే ప్రపంచకప్‌ 2023లో గాయపడిన హార్దిక్.. కోలుకుని ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. దాదాపు నాలుగు నెలల పాటు మైదానానికి దూరంగా ఉన్న హార్దిక్.. ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.

వన్డే ప్రపంచకప్‌ 2023 అనంతరం హార్దిక్ పాండ్యా దేశవాళీ, జాతీయ జట్టుకు ఆడకుండా నేరుగా ఐపీఎల్‌లో ఆడడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్‌ కుమార్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. డబ్బు సంపాదన ముఖ్యమే అని, అందులో తప్పు ఏమీ లేదు కానీ తొలుత రాష్ట్రం, దేశం కోసం ఆడితే బాగుంటుందన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ… ‘గత రెండు నెలల్లో హార్దిక్ పాండ్యా క్రికెట్ ఆడలేదు. జాతీయ జట్టు, దేశవాళీ టోర్నీల్లోనూ బరిలోకి దిగలేదు. నేరుగా ఐపీఎల్‌లోనే ఆడేందుకు సిద్దమవుతున్నాడు. దీనిని ఎలా చెప్పాలో తెలియడం లేదు. డబ్బు సంపాదన ముఖ్యమే. అందులో తప్పు ఏమీ లేదు. కానీ ముందుగా రాష్ట్రం, దేశం కోసం ఆడితే బాగుంటుంది’ అని అన్నాడు.

Also Read: Bjp Candidate List 2024: నేడు బీజేపీ రెండో జాబితా.. 90 మంది అభ్యర్థులు ఖరారు!

‘ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఐపీఎల్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. జాతీయ జట్టు, ఐపీఎల్‌ ఏది ముఖ్యమంటే.. రెండూ కీలకమే అని నేను చెబుతా. డబ్బు కోసమే ఐపీఎల్‌ ఆడటం సరికాదు. ఏ ఆటగాడైనా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా భావించాలి. కానీ కొందరి ఆటగాళ్లలో ఆ భావన ఉండటం లేదు. ఐపీఎల్‌ ఆడడం కోసం ఒక నెల ముందు విశ్రాంతి తీసుకుని.. సిద్ధమవుతున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్‌కు సమాన ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది. ఫ్రాంచైజీ క్రికెట్‌ను వదిలేయమని నెందు చెప్పడం లేదు కానీ జాతీయ జట్టుకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి’ అని ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నాడు.