ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. టోర్నీ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మార్చి 24న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. 2023లో గుజరాత్‌ను నడిపించిన హార్దిక్ పాండ్యా ఈసారి ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గుజరాత్‌ను హార్దిక్ వీడటంపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ స్పందించాడు. హార్దిక్ వెళ్లినా గుజరాత్‌కు పెద్దగా నష్టం లేదని, టైటాన్స్ ఇప్పటికీ బలంగానే ఉందని అభిప్రాయపడ్డాడు.
బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ… ‘హార్దిక్ పాండ్యా లేకపోవడం గుజరాత్ టైటాన్స్‌కు అంత పెద్ద నష్టమని నేను అనుకోను. మిడిల్ ఆర్డర్‌లో హార్దిక్ నాణ్యమైన ఆల్‌రౌండర్. కానీ హార్దిక్ లేని లోటును గుజరాత్ పూడ్చుకోగలదు. గుజరాత్‌కు మంచి బౌలింగ్ డెప్త్ ఉంది. హార్దిక్ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు కానీ.. అది అతడికి అంతగా సెట్ కాదు. అందుకే అతడు లేకున్నా.. గుజరాత్ పటిష్టంగానే ఉంది’ అని అన్నాడు.
Also Read: T20 World Cup 2024: సీఏపై ఒత్తిడి తెస్తున్న కోచ్.. ఆస్ట్రేలియాకు కొత్త కెప్టెన్!
‘ముంబై ఇండియన్స్ తరఫున హార్దిక్ పాండ్యా లోయర్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం మంచిదని నేను భావిస్తున్నా. హార్దిక్ అదే పని చేస్తాడని అనుకుంటున్నాను. ముంబైగా తరఫున అతడు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడని భావిస్తున్నా’ అని బ్రాడ్ హాగ్ చెప్పుకొచ్చాడు. హార్దిక్ పాండ్యా ముంబైకి మారడంతో గుజరాత్ టైటాన్స్ తమ కొత్త కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్‌ను నియమించింది. భారీ అంచనాలు, స్టార్ ఆటగాళ్లతో నిండిన టైటాన్స్‌ను గిల్ ఎలా నడిపిస్తాడో చూడాలి. గత రెండు సీజన్లలో గుజరాత్ ఫైనల్ చేరిన విషయం తెగెలిసిందే.