iPhone Users Alert: ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు చెందిన నేషనల్ సైబర్‌క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) తాజాగా ఐఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కొత్త ఫిషింగ్ మోసంపై హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా పోయిన ఫోన్ లేదా దొంగిలించబడిన ఐఫోన్ల యజమానులను టార్గెట్ చేస్తూ ఈ మోసాలు జరుగుతున్నట్లు గుర్తించింది.
సైబర్ నేరగాళ్లు తమ చేతికి వచ్చిన దొంగిలించిన ఐఫోన్లను పూర్తిగా అన్‌లాక్ చేసేందుకు ఈ కొత్త పద్ధతిని ఉపయోగిస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది. ఇందుకోసం వారు యాపిల్ సపోర్ట్ పేరుతో నకిలీ SMS లు పంపుతున్నారు. ఆ సందేశాల్లో “మీ ఐఫోన్ ఆఫ్ అయింది”, “డేటా ఎరేజ్ చేయాలి”, “డివైస్ ట్రాక్ చేయండి” వంటి అత్యవసర హెచ్చరికలు ఉంటాయి.
ఆ SMSలో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే యూజర్లు అసలు యాపిల్ లేదా ఐక్లౌడ్ లాగిన్ పేజీలా కనిపించే నకిలీ వెబ్‌సైట్‌కు వెళ్లిపోతారు. అక్కడ యాపిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో పాటు OTP కూడా అడుగుతారు. బాధితులు ఆ వివరాలు నమోదు చేసిన వెంటనే సైబర్ నేరగాళ్లు వారి ఐక్లౌడ్ ఖాతాపై పూర్తి నియంత్రణ సాధిస్తున్నారు. అంతేకాదు, దొంగిలించిన ఐఫోన్ నుంచి అసలు యజమాని Apple IDను తొలగించి, “Find My iPhone” ఫీచర్‌ను కూడా డిసేబుల్ చేస్తున్నారు. దీంతో ఆ ఫోన్‌ను మళ్లీ అమ్మడం లేదా వాడటం వారికి సులభమవుతోంది. సైబర్ నిపుణుల ప్రకారం ఈ మోసం చాలా ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. ముఖ్యంగా ఫోన్ పోయిందనే ఆందోళనలో ఉన్న వినియోగదారుల భావోద్వేగాలను ఉపయోగించుకుని నేరగాళ్లు మోసం చేస్తున్నారు.
సురక్షితంగా ఉండేందుకు సూచనలు:
* SMS ద్వారా వచ్చిన అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయొద్దు.
* OTPలను ఎవరితోనూ పంచుకోవద్దు.
* అధికారిక యాపిల్ “Find Devices” సేవనే ఉపయోగించాలి.
* “Find My iPhone” ఫీచర్‌ను ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచాలి.
* Two-Factor Authentication (2FA) తప్పనిసరిగా ఆన్ చేయాలి.
* ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్‌లో బ్లాక్ చేయించాలి.
* ఫిషింగ్ ప్రయత్నాలను వెంటనే National Cyber Crime Portal లో ఫిర్యాదు చేయాలి లేదా 1930కు కాల్ చేయాలి.
అలాగే యాపిల్ అధికారిక డివైస్ ట్రాకింగ్ సేవ కోసం Apple Find Devices సర్వీస్ ను మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు.
