iPhone Prices Drop in India after iPhone 16: టెక్ దిగ్గజం ‘యాపిల్’ తన కొత్త సిరీస్ ఫోన్‌లను లాంచ్ చేయగానే.. పాత సిరీస్ ఫోన్‌ల ధరలు తగ్గించడం లేదా కొన్నింటిని నిలిపివేయడం సాధారణమే. ఈ క్రమంలో సోమవారం (సెప్టెంబర్ 9) ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేసిన నేపథ్యంలో పాత మోడళ్ల ధరలను యాపిల్ తగ్గించింది. కొన్ని ఫోన్‌లపై రూ.10వేల వరకు తగ్గింది. మరికొన్ని పాత మోడళ్ల తయారీని యాపిల్ పూర్తిగా నిలిపివేసింది.
ప్రస్తుతం యాపిల్ ఆన్‌లైన్ స్టోర్లలో ఐఫోన్ 15, ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌ల ధరలు రూ.10వేల వరకు తగ్గాయి. 2023లో ఐఫోన్ 15 128జీబీ వేరియంట్ ధర రూ.79,900కు లాంచ్ అయింది. ఇప్పుడు ఈ ఫోన్ ధర రూ.69,900గా ఉంది. ఐఫోన్ 15 256 జీబీ వేరియంట్ రూ.79,900కి లభించనుంది. ఐఫోన్ 14 128 జీబీ వేరియంట్‌పై రూ.10వేల మేర తగ్గి రూ.59,900కి లభిస్తుంది. ఐఫోన్ 14 256 జీబీ వేరియంట్ ధర రూ.69,900కి.. ఐఫోన్ 14 512 జీబీ వేరియంట్ రూ.89,900కు అందుబాటులో ఉంది. ఐఫోన్ 15 లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధరను రూ.10వేలు చొప్పున యాపిల్ తగ్గిన విషయం తెలిసిందే.
ఐఫోన్ 16 విడుదల సందర్భంగా ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ తయారీని యాపిల్ నిలిపివేసింది. ఐఫోన్ 13, వాచ్ సిరీస్ 9ను కూడా కంపెనీ నిలిపివేసింది. యాపిల్ కొత్త మోడళ్లను కొనలేని వారు తక్కువ ధరకు లభించే పాత మోడళ్లను కొనుగోలు చేస్తుంటారు. యాపిల్ ఫోన్లకు ఐదేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇస్తుండడమే ఇందుకు కారణం. స్వయంగా యాపిల్ ధరలను తగ్గించగా.. పండగ సీజన్‌లో నిర్వహించే సేల్స్‌లో ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.