విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గమ్మ క్షేత్రం ఇంద్రకీలాద్రిపై ఇన్‌స్టాగ్రామ్ రీల్ చిత్రీకరణ తీవ్ర వివాదానికి దారితీసింది. ఆలయ ప్రాంగణంలోని మహామండపం 7వ అంతస్తు రాజగోపురం వద్ద (చైర్మన్ కార్యాలయం సమీపంలో) ఒక యువతి డ్యాన్స్ చేస్తూ రీల్ చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ కావడంతో, ఆలయ పవిత్రతకు, ఆచార వ్యవహారాలకు భంగం కలిగిందని భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి తీవ్రంగా స్పందించింది. ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ ఆదేశాల మేరకు అధికారులు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. జులై 30న మధ్యాహ్నం 1:45 నుంచి 1:47 గంటల మధ్య ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ప్రాథమికంగా గుర్తించారు. సదరు యువతికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వివరాలు, రీల్ వీడియో ఆధారాలను విచారణ నిమిత్తం పోలీసులకు అందజేశారు. దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ యువతిని త్వరితగతిన గుర్తించి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని దేవస్థానం కోరింది.
Vijayawada ..
Security lapse on Vijayawada Indrakeeladri..
Youth who made reels in front of Indrakeeladri Rajagopuram and posted on Instagram..
Youth dancing while making reels in front of Rajagopuram…
Devotees fuming over the security lapse… pic.twitter.com/KPxmE0UeOf— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) August 2, 2026
‘ఇంద్రకీలాద్రి పవిత్రతను, విశిష్టతను కాపాడటానికి దేవస్థానం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. క్షేత్ర ఆచారాలు, సాంప్రదాయాలను కాలరాస్తూ ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై ఎలాంటి ఉపేక్ష వహించేది లేదు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని ఆలయ ఈఓ వి.కె.శీనా నాయక్ పేర్కొన్నాడు.
ఈ రీల్ చిత్రీకరణ సమయంలో రాజగోపురం వద్ద భద్రతా సిబ్బంది తీరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతుండటంతో, సెక్యూరిటీ లోపాలపైనా అధికారులు అంతర్గత విచారణ జరుపుతున్నారు.

