Site icon NTV Telugu

Minister Satya Kumar Yadav: నాటి ప్రధానిని స్ఫూర్తిగా తీసుకుని.. ప్రధానిగా మారిన వ్యక్తి మోడీ..

Minister Satya Kumar Yadav

Minister Satya Kumar Yadav

Minister Satya Kumar Yadav: నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయిని స్ఫూర్తిగా తీసుకుని నేడు ప్రధానిగా మారిన వ్యక్తి నరేంద్ర మోడీ అన్నారు మంత్రి సత్యకుమార్‌ యాదవ్.. అటల్ బిహారీ వాజ్‌పేయి వ్యక్తిత్వం, ఆలోచనలు, పాలన శైలి నేటి ప్రధాని నరేంద్ర మోడీకి స్ఫూర్తిగా నిలిచాయన్నారు.. నెల్లూరులో నిర్వహించిన అటల్ మోడీ సుపరిపాలన యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ.. వాజ్‌పేయిని అత్యంత దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నానని అన్నారు. ప్రజల వేదనను తన కవిత్వం ద్వారా వ్యక్తపరిచిన నేత వాజ్‌పేయి అని, పార్లమెంటులో ఆయన ప్రసంగాలు దేశమంతా ఆసక్తిగా వినేలా ఉండేవని గుర్తు చేశారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. 63 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలోనే ఉన్నా.. నమ్మిన సిద్ధాంతాలను వదలకుండా బీజేపీలోనే కొనసాగారని తెలిపారు. కేవలం రెండు సీట్లు మాత్రమే గెలిచిన సందర్భంలో కూడా మనోస్థైర్యం కోల్పోకుండా ముందుకు సాగారని అన్నారు సత్యకుమార్‌.

Read Also: CMR Shopping Mall: రాజాంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ 44వ స్టోర్ ఘన ప్రారంభం..

నేను అపజయాన్ని అంగీకరించను.. కాలం రాసిన తలరాతను మార్చేస్తా.. అంటూ వాజ్‌పేయి కవిత్వం ద్వారా వ్యక్తపరిచిన ఆత్మవిశ్వాసమే.. భవిష్యత్‌లో బీజేపీకి కొత్త దారులు వేసిందన్నారు. ఆయన సృష్టించిన ఆ మార్గంలోనే అనేక మంది నాయకులు ఎదిగారని చెప్పారు సత్యకుమార్‌.. ఆ నాయకుల్లో ప్రధానంగా ప్రస్తావించాల్సిన పేరు నరేంద్ర మోడీ అని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు. నాటి ప్రధాని వాజ్‌పేయిని స్ఫూర్తిగా తీసుకుని నేడు దేశ ప్రధానిగా ఎదిగిన నేత మోడీ అని కొనియాడారు. మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని అన్నారు.

ఇక, త్వరలో విశాఖపట్నం, అమరావతిలో మెట్రో రైలు ప్రాజెక్టులు రానున్నాయని వెల్లడించారు. రక్షణ రంగం, వ్యవసాయం, తయారీ రంగాల్లో వాజ్‌పేయి నాటిన విత్తనాలు నేడు విస్తృతంగా ఫలిస్తున్నాయని చెప్పారు. పాకిస్తాన్‌కు స్నేహ హస్తం అందించినా కుట్రలు చేయడంతో వాజ్‌పేయి సమరానికి సిద్ధమై వారికి తగిన బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. గతంలో దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరుగుతుండేవని.. కానీ మోడీ 11 ఏళ్ల పాలనలో ఒక్క పెద్ద ఉగ్రదాడి కూడా జరగలేదన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్‌ల ద్వారా భారత్ సత్తా చాటిందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ శక్తిని ప్రపంచ దేశాలకు చూపించిన నేత నరేంద్ర మోడీ అని మంత్రి సత్య కుమార్ అన్నారు.

Exit mobile version