నేపాల్‌లో సంభవించిన బీభత్సమైన మెరుపు వరదల తర్వాత, ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ అయిన ‘ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్’ (IPS) సీఈఓ లక్ష్ గోపిశెట్టి అదృశ్యమయ్యారని, ఆయనను సంప్రదించడం సాధ్యపడటం లేదని ఇన్ఫోసిస్ అధికారికంగా తెలిపింది. ఆయన తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లి ఈ విపత్తులో చిక్కుకున్నట్లు సమాచారం. ఆయనను వీలైనంత త్వరగా గుర్తించడం, క్షేమంగా కలిసేలా చూడటం , ఆయన భద్రతను నిర్ధారించడమే తమ తక్షణ ప్రాధాన్యత అని కంపెనీ ప్రకటించింది.
సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలు, అధికారులతో కలిసి ఆయన వివరాలు సేకరించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ క్లిష్ట సమయంలో లక్ష్ గోపిశెట్టి కుటుంబంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, వారికి కావలసిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
లక్ష్ గోపిశెట్టి ఐటీ, పబ్లిక్ సెక్టార్ విభాగంలో 30 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ అధికారి. ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ అమెరికా, కెనడాల్లోని ప్రభుత్వ రంగానికి వ్యూహాత్మక సాంకేతిక సేవలను అందిస్తుంది. గతంలో ఆయన ఇన్ఫోసిస్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్‌గా, యాక్సెంచర్ (Accenture) మేనేజింగ్ డైరెక్టర్‌గా, అలాగే IBM, PwC, HCL సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన ఈ తీవ్ర విపత్తు వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, కనీసం 320 మందికి పైగా భారతీయులు గల్లంతయ్యారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. విపత్తు బాధిత ప్రాంతాల నుంచి విదేశాంగ శాఖ భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చే చర్యలు ముమ్మరం చేసింది.

