Site icon NTV Telugu

IND vs ENG: సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ ఢీ.. త్రిషపై భారీ అంచనాలు!

Gongadi Trisha

Gongadi Trisha

మహిళల అండర్‌-19 ప్రపంచకప్‌ 2025లో జోరుమీదున్న భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్ స్టేడియంలో శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది. భారత కాలమానం ప్రకారం.. మ్యాచ్ మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది. మొదటి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మహిళలు తలపడనున్నారు. సెమీఫైనల్లో గెలిచిన జట్లు ఆదివారం జరిగే ఫైనల్లో ఢీ కొట్టనున్నాయి.

అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. గ్రూప్‌ దశలో వెస్టిండీస్, మలేసియాలను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన టీమిండియా.. శ్రీలంకను 60 పరుగుల తేడాతో ఓడించింది. సూపర్‌ సిక్స్‌లో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో, స్కాట్లాండ్‌పై 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న భారత్.. సెమీఫైనల్లో ఫేవరెట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని విభాగాల్లోనూ ఫామ్‌లో ఉన్న భారత జట్టును అడ్డుకోవడం ఇంగ్లండ్‌కు పెను సవాలే అని చెప్పాలి.

అండర్‌-19 ప్రపంచకప్‌లో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష పరుగుల వరద పారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో 76.66 సగటుతో 230 పరుగులు చేసింది. తెలుగమ్మాయి టోర్నీ టాప్‌ స్కోరర్‌గా ఉంది. స్కాట్లాండ్‌పై 59 బంతుల్లో 110 పరుగులు చేసిన త్రిషపై భారీ అంచనాలు ఉన్నాయి. మరో సెంచరీ చేయాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు బౌలర్లు వైష్టవి శర్మ, ఆయూషి శుక్లా మంచి ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. వైష్టవి 12 వికెట్లు, ఆయూషి 10 వికెట్లు పడగొట్టారు.

Exit mobile version