NTV Telugu Site icon

INDvsNZ T20: ఒక్క మ్యాచ్..పది రికార్డులు బ్రేక్

Ind

Ind

న్యూజిలాండ్‌తో జరిగిన మూడోదైన చివరి టీ20లో టీమిండియా ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టింది. ప్రత్యర్థి జట్టుపై అన్ని విభాగాల్లోనూ పైచేయి సాధించింది. తద్వారా 168 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూడో టీ20 మ్యాచ్‌లో కొన్ని రికార్డులూ బ్రేకయ్యాయి. ఇందులో కొన్ని సెంచరీ హీరో గిల్ సాధించినవి కాగా.. మరికొన్ని టీమిండియా పేరిట ఉన్నాయి. టీ20ల్లో తొలి సెంచరీతోనే గిల్ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో గిల్ కేవలం 63 బాల్స్ లోనే 126 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం కేవలం 66 రన్స్‌కే కుప్పకూలింది. దీంతో శుభ్‌మన్ గిల్.. కివీస్ ను 60 పరుగుల తేడాతో ఓడించాడంటూ ఎన్నో మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో గిల్, ఇండియన్ టీమ్ బ్రేక్ చేసిన రికార్డులేంటో ఒకసారి చూద్దాం.

గిల్ రికార్డులు..

  1. ఈ మ్యాచ్‌లో గిల్ చేసిన 126 రన్స్ టీ20ల్లో ఇండియాకు అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఈ క్రమంలోనే గతేడాది ఆసియా కప్‌లో ఆఫ్గానిస్తాన్‌పై విరాట్ కోహ్లి చేసిన 122 రన్స్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు.
  2. టీ20ల్లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయసు ఇండియన్ ప్లేయర్ గిల్. అతని ప్రస్తుత వయసు 23 ఏళ్ల 146 రోజులు. ఇంతకుముందు 23 ఏళ్ల 156 రోజులతో సురేశ్ రైనా పేరిట ఉన్న రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. ఇప్పటికే ప్రపంచ రికార్డు మాత్రం 22 ఏళ్ల 127 రోజులతో పాకిస్తాన్ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ పేరిట ఉంది.
  3. ఇక ఇవే 126 రన్స్ న్యూజిలాండ్‌పై ఓ బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు. ఇంతకుముందు సౌతాఫ్రికా బ్యాటర్ రిచర్డ్ లెవీ 2012లో 117 రన్స్ చేశాడు.
  4. అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన యంగెస్ట్ ఇండియన్ ప్లేయర్ కూడా శుభ్‌మన్ గిల్. సురేశ్ రైనా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్ తర్వాత మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన ఐదో ఇండియన్‌గా గిల్ నిలిచాడు.

టీమిండియా రికార్డులు..

    1. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 66 పరుగులకే ఆలౌటైంది. గతంలో టీ20ల్లో ఏ ప్రత్యర్థినీ ఇండియా ఇంత తక్కువ స్కోరుకు పరిమితం చేయలేదు.
    2. చివరి టీ20లో న్యూజిలాండ్‌ను ఇండియా 168 రన్స్ తేడాతో ఓడించింది. టీ20ల్లో ఇండియాకు ఇదే అతిపెద్ద విజయం. ఐసీసీలోని పూర్తిస్థాయి సభ్యదేశాల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లోనూ ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం.
    3. ఇండియా ఈ మ్యాచ్ లో 4 వికెట్లకు 234 రన్స్ చేసింది. టీ20ల్లో న్యూజిలాండ్‌పై చేసిన అత్యధిక స్కోరు ఇదే.
    4. స్వదేశంలో వరుసగా 13 టీ20 సిరీస్‌ల్లో టీమిండియాకు ఓటమెరగని రికార్డు ఉంది. అందులో 11 గెలవగా.. మరో రెండు డ్రా అయ్యాయి.
    5. న్యూజిలాండ్ వికెట్లన్నీ టీమిండియా పేస్ బౌలర్లే తీశారు. టీ20ల్లో ఇండియన్ టీమ్ ఇలా చేయడం ఇది రెండోసారి. ఇక స్వదేశంలో మాత్రం ఇదే తొలిసారి.
    6. ఇక ఓ టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ తన అన్ని వికెట్లను పేస్ బౌలర్లకే సమర్పించుకోవడం కూడా ఇదే తొలిసారి.

Also Read: Shubhman Gill: సచిన్ చూస్తుండగా గిల్ సెంచరీ.. వైరల్ అవుతోన్న మీమ్స్