Indravati Tiger Reserve: ఛత్తీస్‌గఢ్‌లో అద్భుతం.. నాలుగు దశాబ్దాల తర్వాత టూరిస్టులకు ఇంద్రావతి అడవులు స్వాగతం..

Indira

Indira

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో ఉన్న ఇంద్రావతి టైగర్ రిజర్వ్‌ను పర్యాటకుల కోసం ప్రభుత్వం అధికారికంగా తెరిచింది. నూతన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మావోయిస్టుల ప్రాభవం తగ్గి, భద్రతా పరిస్థితులు మెరుగవ్వడంతో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ అటవీ ప్రాంతంలోకి పర్యాటక రంగాన్ని అనుమతించారు. దేశంలోనే నాల్గవ అతిపెద్దదైన ఈ టైగర్ రిజర్వ్‌లో పులులు, చిరుతపులులు, అడవి దున్నలు, జింకలు వంటి అరుదైన వన్యప్రాణులు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ సుమారు 6 పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మొదటి విడతలో పరిమిత స్థాయిలో సఫారీని ప్రారంభించారు. బఫర్ జోన్‌లో 33 కిలోమీటర్ల సఫారీ మార్గాన్ని గుర్తించగా, ప్రస్తుతానికి ఉల్లూరు గ్రామం నుంచి దండపర్తి వరకు 9 కిలోమీటర్ల మేర మార్గాన్ని సిద్ధం చేశారు. పర్యాటకుల కోసం నాలుగు జిప్సీ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో వాహనానికి రోజువారీ సఫారీ రుసుము రూ. 2,000గా నిర్ణయించారు. పర్యాటకుల స్పందనను బట్టి భవిష్యత్తులో వాహనాల సంఖ్యను, మరిన్ని కొత్త రూట్లను పెంచనున్నట్లు రాష్ట్ర అటవీశాఖ (వన్యప్రాణుల విభాగం) ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి (PCCF) ఓపీ యాదవ్ తెలిపారు.

ఈ పర్యాటక ప్రాజెక్ట్ ద్వారా స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. స్థానిక యువతను సఫారీ డ్రైవర్లుగా, గైడ్లుగా నియమించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దీనివల్ల పర్యాటకులు అడవి విశేషాలను స్థానికుల ద్వారా తెలుసుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా హోమ్‌స్టేలు, స్థానిక హస్తకళలు, బస్తర్ ఆర్ట్, సాంప్రదాయ వంటకాలను ప్రోత్సహిస్తూ అక్కడి గ్రామస్తుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేస్తోంది. ఇంద్రావతి నది ఒడ్డున ఉన్న మధి మార్ఖా ప్రాంతం, దట్టమైన అడవుల మధ్య 300 అడుగుల ఎత్తులో ఉన్న నంబి జలపాతం వంటి ప్రకృతి అందాలను ఈ పర్యాటక సర్క్యూట్‌లో చేర్చారు. వన్యప్రాణుల సంరక్షణకు ఆటంకం కలగకుండా, బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.