విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై 2025 దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ‘మూలా నక్షత్రం’ రోజు కావడంతో సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి అర్ధ రాత్రి నుంచే భక్తులను అనుమతించారు. దీంతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. అమ్మవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వినాయక గుడి నుంచి సుమారు 3 కిమీ మేర భక్తులు బారులు తీరారు.
ఉదయం 9:30 గంటలకు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారని బెజవాడ ఆలయ అధికారులు తెలిపారు. ఈరోజు 3 లక్షల పైచిలుకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మూల నక్షత్రం సందర్బగా వీఐపీ, వీవీఐపీ దర్శనాలను రద్దు చేశారు. అన్ని క్లూ లైన్‌లలో ఉచిత దర్శనం ఏర్పాట్లు చేశారు. తిరుపతి తరహాలో భక్తులకు హోల్డింగ్ పాయింట్స్, పదికి పైగా కంపట్మెంట్స్ ఏర్పాటు చేశారు. క్లూ లైన్లలో ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. క్లూ లైన్లలో ఉన్న భక్తులకు వాటర్ బొట్టిల్స్, బిస్కెట్ పాకెట్స్, పాలు, మజ్జిగ పాకెట్స్ పంపిణి చేస్తున్నారు.
సరస్వతిదేవి అలంకారంలో దర్శనమిస్తున్న జగన్మాత దుర్గమ్మను కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, హోంమంత్రి వంగలపూడి అనిత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, తుని ఎమ్మెల్యే యనమల దివ్య, విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని) దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 4:30 నిముషాలకు సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
