Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..

Indiramma Houses

Indiramma Houses

హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ టవర్లకు వస్తున్న విశేష స్పందనను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా వీటిని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో విడతల వారీగా ఈ భవనాలను ఏర్పాటు చేయనున్నారు. తొలి విడత కింద నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు హౌసింగ్ బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని స్థలాలను పరిశీలించడంతో పాటు డీపీఆర్ రూపకల్పన వేగంగా జరుగుతోంది.

నగరంలో ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి సుమారు రూ.11 లక్షల వరకు బడ్జెట్ అంచనా ఉండగా.. జిల్లాల్లో మాత్రం నిర్మాణ ఖర్చు కొంత తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. జిల్లాల్లో ప్రతి ఫ్లాట్‌కు సుమారు రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఖర్చు కానుందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ అందించే ఇందిరమ్మ ఇళ్ల సబ్సిడీ పోను, లబ్ధిదారులు కేవలం రూ.4 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

ప్రభుత్వ, హౌసింగ్ బోర్డుకు చెందిన ఖాళీ స్థలాలనే ఈ టవర్ల నిర్మాణం కోసం పూర్తిగా వినియోగిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ఈ ప్రాజెక్టుల పనులు ప్రారంభం కాగా.. ఇప్పుడు జిల్లాల్లో కూడా అమలు చేయనుండటంతో పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కల మరింత సులభంగా నెరవేరనుంది. అర్హులైన పేదలందరికీ పారదర్శక పద్ధతిలో ఈ ఫ్లాట్లను కేటాయించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.