IndiGo: గత రెండు రోజులుగా ఇండిగో విమానాలు వార్తల్లో నిలుస్తున్నాయి. సాంకేతిక కారణాల వల్ల విమానాలు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీని వలన విమానాశ్రయంలో వందలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మరో షాకింగ్ వార్త వచ్చింది. ఏజెన్సీ ప్రకారం.. శుక్రవారం 400కి పైగా విమానాలను ఎయిర్‌లైన్ రద్దు చేసింది. న్యూఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు, ప్రాంతాలకు నడిచే విమానాలు ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయి. డిసెంబర్ 5, 2025న, ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరే 53, ఎయిర్‌పోర్టుకు రావాల్సిన 51 విమానాలు సహా మొత్తం 104 విమానాలు రద్దు చేశారు. బెంగళూరు విమానాశ్రయానికి రావాల్సిన 52, అక్కడి నుంచి బయలుదేరే 50 విమానాలు రద్దు చేశారు. హైదరాబాద్ విమానాశ్రయంలో 43 రాక, 49 బయలుదేరే విమానాలు రద్దు
చేశారు. డిసెంబర్ 5న అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పూణే విమానాశ్రయంలో 32 విమానాలకు అంతరాయం ఏర్పడింది.
మరోవైపు.. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా స్పందించారు. “ఇండిగో గందరగోళం ప్రభుత్వ ఏకాధిపత్య మోడల్ వల్ల వచ్చిన సమస్య.. విమానాల ఆలస్యం, క్యాన్సిలేషన్ వల్ల బాధపడేది సామాన్యులే.. ప్రతి రంగంలోనూ భారత్‌కు న్యాయమైన పోటీతత్వానికి అర్హత ఉంది.. కాకపోతే ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ చేసే మోనోపోలీలు కాదు.” అని పేర్కొన్నారు.
