Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?

Employees Bonus

Employees Bonus

Employees Bonus: పండుగ వేళ రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్ వచ్చేసింది. ఈ పండుగ సీజన్‌లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వే ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) లేదా వార్షిక బోనస్‌కు యూనియన్ క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఓ జాతీయ మీడియా తెలిపిన సమాచారం ప్రకారం.. గత సెప్టెంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 10,91,146 మంది రైల్వే ఉద్యోగులకు రూ.1,865.68 కోట్ల వ్యయంతో 78 రోజుల ప్లస్ బోనస్‌ ఇచ్చేందుకు ఆమోదం లభించింది. ప్రతి ఏటా దుర్గాపూజ లేదా దసరా సెలవులకు ముందే రైల్వే సిబ్బందికి ఈ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌ను చెల్లిస్తూ ఉంటారు. అయితే, ప్రస్తుతం క్యాబినెట్ ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నంత మాత్రాన బోనస్ ఆమోదం పొందినట్లు కాదని, ప్రభుత్వం ఇంకా తుది చెల్లింపు వివరాలను లేదా అధికారిక ప్రకటనను విడుదల చేయాల్సి ఉందనే విషయాన్ని గమనించాలి.

ఒకవేళ ఈ ఆమోదం లభిస్తే సుమారు 10.91 లక్షల మంది ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన బోనస్ లభిస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి రైల్వే ఉద్యోగికి లభించే గరిష్ట బోనస్ మొత్తం రూ.17,951గా ఉంది. ట్రాక్ మెయింటెనర్లు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు (గార్డులు), స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్స్‌మెన్, మినిస్టీరియల్ సిబ్బందితో పాటు ఇతర గ్రూప్ ‘సి’ ఉద్యోగులందరికీ ఈ మొత్తం అందుతుంది. అయితే, ప్రస్తుతం ఈ వార్షిక బోనస్‌ను నెలకు రూ.7,000 వేతన పరిమితి (వేజ్ సీలింగ్) ఆధారంగా, 78 రోజుల కాలానికి లెక్కిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు ఈ సీలింగ్‌ను పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నప్పటికీ, 2014-15 నుంచి ఈ వేతన పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ (IRSTA) కేంద్ర ప్రభుత్వానికి ఒక కీలక వినతిని ఇచ్చింది. లెవల్-1 ఉద్యోగులకు ఈ సీలింగ్‌ను రూ.18,000 ప్లస్ కరువు భత్యం (DA)కి పెంచాలని, అలాగే లెవల్-2, ఆపై స్థాయి ఉద్యోగులకు వారి వేతన స్థాయిలకు అనుగుణంగా బోనస్‌ను లెక్కించాలని కోరింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు రాసిన లేఖలో IRSTA స్పందిస్తూ.. నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు PLB లెక్కించడానికి 2016లో నిర్ణయించిన రూ.7,000 నెలవారీ వేతన పరిమితి ప్రస్తుతం ఏమాత్రం వాస్తవానికి దగ్గరగా లేదని పేర్కొంది. 7వ వేతన సంఘం (7th CPC) పే మ్యాట్రిక్స్, ఆ తర్వాత పెరిగిన డిఏ రేట్లకు ఇది ఏమాత్రం సరిపోలడం లేదని స్పష్టం చేసింది. ఈ రూ.18,000 వేతన పరిమితి ప్రాతిపదికన బోనస్ లెక్కిస్తే, ఉద్యోగులకు ప్రస్తుతం వస్తున్న వార్షిక బోనస్ రూ.17,000 నుంచి కనీసం రూ.46,184కి పెరుగుతుందని అసోసియేషన్ సిఫార్సు చేసింది. రైల్వేలో అతితక్కువ గ్రేడ్ అయిన పే లెవల్-1 ఎంట్రీ పే ఈ ఏడాది జనవరి ఒకటి నాటికే రూ.18,000గా నిర్ణయించినట్లు వివరించారు. ప్రస్తుత కనిష్ట మూల వేతనం రూ.18,000 ప్రాతిపదికన 78 రోజులకు బోనస్ లెక్కిస్తే.. రూ.18,000 x 78 రోజులు ÷ 30.4 (నెలకు సగటు రోజులు) = రూ.46,184 అవుతుందని లెక్కలతో సహా వివరించింది.