భారత సైన్యానికి మరింత బలాన్ని చేకూరుస్తూ.. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక ఆయుధాల తొలి విడత సరఫరా ప్రారంభమైంది. అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ, ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ (IWI) భాగస్వామ్యంతో తయారు చేసిన 2,000 ‘ప్రహార్’ లైట్ మెషిన్ గన్ల (LMGs)ను శనివారం భారత ఆర్మీకి అందజేసింది. గ్వాలియర్‌లోని తయారీ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారీ..
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఈ 7.62 ఎంఎం కాలిబర్ ఆయుధాలను భారత్‌లోనే ఉత్పత్తి చేశారు. మొత్తం 40,000 గన్ల తయారీ ఆర్డర్‌లో భాగంగా ఇప్పుడు మొదటి 2,000 గన్లను సరఫరా చేశారు. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన గడువు కంటే 11 నెలల ముందే ఈ సరఫరాను పూర్తి చేయడం విశేషం.
ఇజ్రాయెల్‌లో ‘నెగెవ్ NG7’గా పిలిచే ఈ ‘ప్రహార్’ గన్లు పదాతి దళం సామర్థ్యాన్ని భారీగా పెంచుతాయి. ఇది కేవలం 7.6 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. ఇతర దేశాల గన్లతో పోలిస్తే ఇది 22 నుంచి 38 శాతం తక్కువ బరువును కలిగి ఉండి.. సైనికులు సులభంగా మోసుకెళ్లేందుకు వీలుగా ఉంటుంది. దీని పొడవు 1,000 ఎంఎం కాగా, అవసరమైనప్పుడు దీని స్టాక్‌ను మడతపెట్టి 820 ఎంఎంకు తగ్గించవచ్చు. ఇది పారాట్రూపర్లు (పారాచూట్ ద్వారా దూకే సైనికులు) యుద్ధ రంగంలోకి దిగేటప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ వాడే అత్యాధునిక ‘ఇండస్ట్రీ 4.0’ సిస్టమ్స్ వల్ల ఈ ఆయుధాల్లో లోపాలు వచ్చే అవకాశం 0.5 శాతం కంటే తక్కువగా ఉంటుందని సంస్థ తెలిపింది.
భవిష్యత్ లక్ష్యాలు..
అదానీ డిఫెన్స్ సీఈఓ ఆశిష్ రాజ్వంశీ మాట్లాడుతూ.. కేవలం ఆయుధాలను సరఫరా చేయడమే కాకుండా.. భారత్‌ను చిన్న తరహా ఆయుధాల తయారీలో గ్లోబల్ హబ్‌గా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఏటా లక్ష ఆయుధాలను తయారు చేసే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉందని, వచ్చే మూడేళ్లలో పూర్తి ఆర్డర్‌ను ఆర్మీకి అందజేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
పశ్చిమ ఆసియాలో (ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వంటివి) ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. భారత్‌లో ఆయుధాల తయారీకి ఎలాంటి ఆటంకాలు ఉండవని ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ సీఈఓ షుకీ శ్వార్ట్జ్ స్పష్టం చేశారు. ఈ గన్ల రాకతో భారత సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల శక్తి మరింత పెరుగుతుందని రక్షణ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
