India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..

  • ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్‌లో టీమిండియా స్వర్ణ పతకం కైవసం
  • ఫైనల్లో శ్రీలంకపై భారత్ 147 పరుగుల భారీ తేడాతో ఘన విజయం..
India Win Gold Medal

India Win Gold Medal

India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్‌లో టీమిండియా అదరగొట్టింది. నిస్షిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ 147 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేయగా.. భారీ లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 15.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే ఆలౌటైంది.

భారత్ భారీ స్కోరుకు ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన శుభారంభం అందించారు. షఫాలీ 29 బంతుల్లో 48 పరుగులు చేయగా.. స్మృతి మంధాన 45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించారు. అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ 19 పరుగులు చేశారు. చివర్లో రిచా ఘోష్ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్ స్కోరును 200 పరుగులు దాటించారు. కేవలం 22 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 49 పరుగులు సాధించారు. భర్తి ఫుల్మాలి 7 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో భారత్ 216/3 భారీ స్కోరు నమోదు చేసింది.

217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. కెప్టెన్ చమరి ఆటపట్టు 21 బంతుల్లో 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. మిగతా బ్యాటర్లు భారత బౌలింగ్‌ను ఎదుర్కోలేక వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో శ్రీలంక 15.4 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌటై భారీ పరాజయాన్ని చవిచూసింది. భారత్ బౌలర్లలో దీప్తి శర్మ 4 ఓవర్లు వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. షఫాలీ వర్మ 2 ఓవర్లలో 3 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. శ్రేయాంక పాటిల్ 2, శ్రీ చరణి 2 వికెట్లు సాధించారు. దీంతో శ్రీలంక ఇన్నింగ్స్ 69 పరుగుల వద్దే ముగిసింది.

ఈ విజయంతో ఆసియా క్రీడల మహిళల క్రికెట్‌లో భారత్ మరోసారి స్వర్ణ పతకాన్ని సాధించింది. 2023 ఆసియా క్రీడల్లోనూ గోల్డ్ మెడల్ గెలిచిన టీమిండియా.. ఇప్పుడు వరుసగా మరోసారి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు శ్రీలంకకు ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం అందుకోవాలన్న ఆశ నెరవేరలేదు. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో స్మృతి మంధాన, రిచా ఘోష్ మెరుపులు మెరిపించగా.. బంతితో దీప్తి శర్మ, షఫాలీ వర్మ, శ్రేయాంక పాటిల్, శ్రీ చరణి సత్తా చాటారు. సమష్టి ప్రదర్శనతో శ్రీలంకను చిత్తుగా ఓడించిన భారత మహిళల జట్టు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది.