Site icon NTV Telugu

T20 World Cup: జయహో భారత్.. ఫస్ట్ మ్యాచ్‌లోనే వరల్డ్ రికార్డ్.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా రికార్డ్స్ బ్రేక్..

India

India

T20 World Cup: ప్రపంచ కప్ షురూ అయ్యింది. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఫస్ట్‌ మ్యాచ్ గెలుపు అంత ఈజీగా రాలేదు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లు మొదట కాస్త తడబడ్డారు. చివరికి బౌలర్లు తమ అనుభవంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్‌ మొదట బాగానే మొదలెట్టింది. కానీ మధ్య ఓవర్లలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాల్క్విక్ భారత బ్యాటింగ్‌ను గట్టిగా దెబ్బతీశాడు. ఆరవ ఓవర్‌లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే వరుసగా అవుట్ అవ్వడంతో స్కోరు ఒక్కసారిగా పడిపోయింది. 13 ఓవర్లకే భారత్‌ 77 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ చేజారిపోతుందేమో అనిపించింది. అలాంటి సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రంగంలోకి దిగాడు.

READ MORE: Astrology: ఫిబ్రవరి 8, ఆదివారం దినఫలాలు.

తన అద్భుత ప్రదర్శనతో అమెరికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని బ్యాట్ నుంచి వచ్చిన పరుగులు భారత ఇన్నింగ్స్‌కు ప్రాణం పోశాయి. చివరి వరకు నిలిచిన కెప్టెన్ 49 బంతుల్లో 84 పరుగులు చేశాడు. అతని పోరాటంతో భారత్‌ 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. అది అంత పెద్ద స్కోరు కాకపోయినా, బౌలర్లు తేలిలోకి మ్యాచ్ వెళ్లిపోయింది. లక్ష్య ఛేదనకు దిగిన అమెరికా జట్టు ధైర్యంగానే ఆడింది. మిలింద్ కుమార్, శుభమ్ రంజనే, సూరజ్ కృష్ణమూర్తి మంచి షాట్లు ఆడుతూ పోరాడారు. దీంతో మ్యాచ్ ఒక్కోసారిగా ఉత్కంఠగా మారింది. అభిమానులు ముక్కున వేలేసుకున్నారు. కానీ భారత బౌలర్ల అనుభవం ఇక్కడ కనిపించింది. మొహమ్మద్ సిరాజ్ కట్టుదిట్టమైన బంతులతో వికెట్లు తీసాడు. అర్షదీప్ సింగ్ కీలక సమయంలో బ్రేక్ ఇచ్చాడు. అక్షర్ పటేల్ తన స్పిన్‌తో పరుగులు కట్టడి చేశాడు. ఈ ముగ్గురు కలిసి అమెరికా బ్యాటింగ్‌ను అదుపులోకి తెచ్చారు. చివరికి అమెరికా జట్టు 20 ఓవర్లలో 132 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్‌ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్‌ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా భారత్‌ నిలిచింది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల పేరుపై ఉన్న రికార్డును దాటుతూ తొమ్మిది వరుస విజయాలతో కొత్త చరిత్ర సృష్టించింది.

Exit mobile version