Site icon NTV Telugu

IND vs PAK: ట్రోఫీకి అడుగు దూరంలో భారత్.. ఆశలన్నీ ఆ యువ ప్లేయర్‌ పైనే..

Indvspak

Indvspak

IND vs PAK: భారత అండర్‌–19 జట్టు మరోసారి జూనియర్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే, రికార్డు స్థాయిలో 12వ టైటిల్‌ను సొంతం చేసుకునే అవకాశం భారత్‌కు దక్కుతుంది. టోర్నమెంట్ మొత్తం మీద భారత జట్టు మిగతా జట్ల కంటే చాలా మెరుగ్గా ఆడింది. ఆదివారం జరిగే ఫైనల్ హోరాహోరీగా సాగనుంది. ఆయుష్ మాథ్రే నాయకత్వంలో భారత్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. గ్రూప్–ఎలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టాప్‌లో నిలిచింది. సెమీఫైనల్లో శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ విజయం భారత ఆధిపత్యాన్ని మరోసారి చూపించింది. ఇప్పటికే గ్రూప్ దశలోనే పాకిస్థాన్‌ను 90 పరుగుల తేడాతో ఓడించి, ఫేవరెట్‌గా నిలిచింది భారత్.

READ MORE: YS Jagan Birthday: నేడే వైఎస్ జగన్ బర్త్ డే.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ సమతుల్యంగా ఆడటమే భారత్ విజయ రహస్యం. బ్యాట్స్‌మెన్ నిరంతరం భారీ స్కోర్లు సాధించగా, బౌలర్లు ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి పెంచారు. అన్ని పరిస్థితుల్లోనూ తగినట్లు ఆడగల సామర్థ్యం ఈ జట్టును బలమైన యూనిట్‌గా మార్చింది. బ్యాటింగ్‌లో భారత జట్టు ప్రదర్శన అద్భుతం. టోర్నమెంట్‌లో రెండు సార్లు 400కు పైగా పరుగులు చేసింది. అయితే.. యువ సంచలన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ యూఏఈపై 95 బంతుల్లో 171 పరుగులు చేసి, భారత్‌ను 433/6 అనే భారీ స్కోర్‌కు చేర్చాడు. ఈ ఇన్నింగ్స్‌తోనే భారత్ దూకుడు ఎలా ఉంటుందో అందరికీ అర్థమైంది. అయితే.. ఈ మ్యాచ్‌లోనూ యువకుడు వైభవ్ పై అభిమానులు పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. పాకిస్థాన్‌ను చిత్తు చేయడంలో వైభవ్ సఫలీకృతం అవుతాడని అందరూ భావిస్తున్నారు.

భారత్ అండర్‌–19 జట్టు: ఆయుష్ మాథ్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిగ్యాన్ కుందు (వికెట్‌కీపర్), కనిష్క్ చౌహాన్, హేనిల్ పటేల్, ఖిలాన్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్, ఉదవ్ మోహన్, నమన్ పుష్పక్, హర్వంశ్ పంగాలియా, యువరాజ్ గోహిల్.

పాకిస్థాన్ అండర్‌–19 జట్టు: సమీర్ మిన్హాస్, హమ్జా జహూర్ (వికెట్‌కీపర్), ఉస్మాన్ ఖాన్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్), హుజైఫా అహ్సాన్, దానియాల్ అలీ ఖాన్, మొహమ్మద్ షయాన్, అబ్దుల్ సుభాన్, మొహమ్మద్ సయ్యామ్, అలీ రజా, మొమిన్ ఖమర్, అలీ హసన్ బలోచ్, నికాబ్ షఫిక్, మొహమ్మద్ హుజైఫా.

 

 

Exit mobile version