India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను 3-2 తో గెలిచిన భారత జట్టు.. వన్డే సిరీస్‌లోనూ 2-0తో ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీతో రాణించడంతో భారత్ సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. రెండో వన్డేలోనూ భారత బౌలర్లు విజృంభించడంతో న్యూజిలాండ్ 134 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇక సిరీస్‌లో భాగంగా మూడో వన్డే నేడు హామిల్టన్ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వాతావరణ సూచన ప్రకారం.. మంగళవారం హామిల్టన్‌లో రోజంతా వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షం పడేందుకు 100 శాతం అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అంతేకాకుండా బుధవారం తెల్లవారుజామున 1 గంట వరకు భారీ వర్షాల హెచ్చరిక కూడా జారీ చేసింది.
ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం తిరిగి రావడంతో టాస్ మరింత ఆలస్యమైంది. ఇప్పటికే మైదానంలో కవర్లను కప్పేశారు. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదం లేకపోలేదు. అయితే వర్షం తగ్గితే ఓవర్లను కుదించి మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంటుంది. మరోవైపు.. రెండో వన్డేలోనూ వర్షం కారణంగా మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. పేసర్లకు అనుకూలించే పిచ్‌పై తక్కువ ఓవర్ల మ్యాచ్‌లో బ్యాటర్లు వేగంగా పరుగులు చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులను సానుకూలంగా తీసుకోవాలని టీమిండియా భావిస్తోంది.
ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత్.. మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను గెలవాలని చూస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. అయితే హామిల్టన్ వాతావరణం సహకరిస్తుందా? వర్షం కారణంగా మ్యాచ్ రద్దవుతుందా? అన్నది వేచి చూడాలి.

