NTV Telugu Site icon

IND vs ENG: మేం ఓటములకు భయపడం.. మైదానంలో దిగి సత్తాచాటుతాం: బెన్ స్టోక్స్

England Test Team

England Test Team

Ben Stokes Hails Ollie Pope and Tom Hartley performance: తాము ఓటములకు భయపడం అని, మైదానంలో దిగి సత్తాచాటుతామని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్నాడు. హైదరాబాద్ టెస్ట్ విజయం చాలా గొప్పదని తెలిపాడు. గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన మ్యాచ్‌లోనే ఓలీ పోప్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడని, ఉపఖండంలో ఒక ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇదే అని పేర్కొన్నాడు. ఎలాంటి అనుభవం లేకపోయినా టామ్ హార్ట్‌లీ అద్భుతంగా బౌలింగ్ చేశాడని స్టోక్స్ ప్రశంసించాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో టీమిండియాపై గెలిచింది. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో స్టోక్స్ సేన 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ… ‘నేను ఇంగ్లండ్ కెప్టెన్సీ తీసుకున్నప్పటి నుంచి గొప్ప విజయాలు అందుకున్నాం. వేదిక, ప్రత్యర్థితో సంబంధం లేకుండా అద్భుత విజయాలు సాధించాం. అయితే ఈ విజయం గొప్పది. కెప్టెన్‌గా విదేశాల్లో ఇదే మొదటి విజయం. నేను ఆటను బాగా పరిశీలిస్తాను. మా తొలి ఇన్నింగ్స్‌ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. భారత స్పిన్నర్లు ఎలా బౌలింగ్ చేశారు, రోహిత్ శర్మ ఫీల్డ్‌ని ఎలా సెట్ చేసాడో చూశాను. మా ఫీల్డింగ్ సమయంలో రోహిత్‌లా ఫీల్డ్ సెట్ చేసి బౌలర్లను మార్చే ప్రయత్నం చేశాం. ఈ విజయం అందరిని థ్రిల్ చేసింది’ అని చెప్పాడు.

Also Read: Rohit Sharma: అతడి వల్లే ఓడిపోయాం.. ఉప్పల్ టెస్ట్ ఓటమిపై రోహిత్ శర్మ!

‘అరంగేట్రంలో టామ్ హార్ట్‌లీ తొమ్మిది వికెట్లు పడగొట్టడం, ఓలీ పోప్ భుజానికి శస్త్రచికిత్స తర్వాత తిరిగి వచ్చి అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. హార్ట్‌లీ తొలిసారి జట్టులోకి వచ్చాడు. ఈ విజయం అతని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. ఏమి జరిగినా హార్ట్‌లీకి ఎక్కువ ఓవర్లు ఇవ్వాలని నేను అనుకున్నా. ఆటగాళ్లకు పూర్తిగా మద్దతు ఇచ్చాం. ఉపఖండంలో ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడే అదృష్టం నాకు దక్కింది. ఇక్కడ జో రూట్ ప్రత్యేకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే నెంబర్ 3లో బ్యాటింగ్‌కు వచ్చిన ఓలి పోప్.. స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో పాటు అద్భుతంగా స్ట్రైక్ రొటేట్ చేశాడు. ఉపఖండంలో ఒక ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇదే అని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఓడిపోయినా.. మిగతా మ్యాచులలో గెలవడంపై దృష్టి పెడుతాం. ఓటములకు మేం భయపడం, మైదానంలో దిగి సత్తాచాటుతాం’ అని బెన్ స్టోక్స్ తెలిపాడు.

Show comments