India: భారత దేశం పక్కనున్న రెండు ముస్లిం దేశాల్లో ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆ రెండు ముస్లిం దేశాలు ఏవేవో మనందరికీ తెలిసిందే. ఇదే టైంలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు, సౌదీ అరేబియా – యూఏఈ మధ్య యెమెన్‌లో వివాదం, గాజాలో అస్థిర రాజకీయ పరిస్థితి వంటి మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ పర్యటన జరిగింది. ఈక్రమంలో భారత్‌కు యూఏఈ, సౌదీ అరేబియా దేశాలలో అసలైన స్నేహితుడు ఎవరు అనే ప్రశ్న ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
READ ALSO: 7.2mm స్లిమ్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు, బడ్జెట్ ధరలో Infinix NOTE Edge లాంచ్.. ధర ఎంతంటే..?
భారత్‌కు UAE ఎందుకు ముఖ్యమైనదంటే..
జాయెద్ అల్ నహ్యాన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశానికి వస్తున్న మూడవ అధికారిక పర్యటన ఇది. గత 10 సంవత్సరాలలో ఆయన భారతదేశానికి వస్తున్న ఐదవ పర్యటన అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇండియాకు యూఏఈ నాయకుల సందర్శనలు కొత్తవి కానప్పటికీ, సౌదీ అరేబియా – పాకిస్థాన్ మధ్య భద్రతా ఒప్పందం, ఇటీవలి యూఏఈ – సౌదీ ఉద్రిక్తతల దృష్ట్యా ఇది ముఖ్యమైనదిగా పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి భారత్‌కు సౌదీ అరేబియా – యూఏఈ రెండింటితో సంబంధాలు బాగున్నాయి. 2022లో సిఇపిఎ (సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం)పై సంతకం చేసినప్పటి నుంచి యూఏఈతో భారతదేశ సంబంధాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
విదేశాంగ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. భారతదేశం- UAE భద్రతా రంగంలో కూడా తమ సంబంధాలను మరింతగా పెంచుకుంటున్నాయి. ఉన్నత స్థాయి సమావేశాలు, ఉమ్మడి సైనిక విన్యాసాలు (డెజర్ట్ సైక్లోన్ వంటివి) పెరుగుతున్న పరిశ్రమ సహకారం ద్వారా ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యం బలోపేతం అవుతోంది. ఇది స్వావలంబన, ప్రాంతీయ స్థిరత్వాన్ని లక్ష్యంగా చేసుకుని UAVలు, AI , సైబర్ రక్షణలో సాంకేతికత భాగస్వామ్యం, ఉమ్మడి అభివృద్ధి/ఉత్పత్తిపై దృష్టి పెడుతుంది.
సౌదీ అరేబియాతో భారతదేశ సంబంధాలు..
మధ్యప్రాచ్యంలో భారతదేశానికి సౌదీ అరేబియా ఒక ముఖ్యమైన దేశం. నిజానికి సౌదీ అరేబియాను ముస్లిం దేశాలకు నాయకుడిగా చూస్తారు. ఈ దేశంతో మంచి సంబంధాలు మధ్యప్రాచ్యం అంతటా భారతదేశం ప్రభావాన్ని బలోపేతం చేస్తాయి. సౌదీ అరేబియా GCC , OIC వంటి సంస్థలకు కూడా నాయకత్వం వహిస్తుంది. సౌదీ అరేబియా చమురు, LPG యొక్క ముఖ్యమైన సరఫరాదారు. భారతదేశం సౌదీ అరేబియాకు పెద్ద మార్కెట్, పెట్టుబడి అవకాశాలను కూడా అందిస్తుంది. సౌదీ సావరిన్ వెల్త్ ఫండ్స్ (PIF వంటివి) భారతీయ కంపెనీలలో (Reliance Jio, HealthifyMe), మౌలిక సదుపాయాలలో కూడా పెట్టుబడి పెడుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. ఈ రెండు దేశాల మధ్య వార్షిక వాణిజ్యం $40 బిలియన్లను దాటింది. భారతీయ కంపెనీలు (L&T, TCS, Wipro) సౌదీ అరేబియాలో విస్తృతంగా పనిచేస్తుండగా, ARAMCO వంటి సౌదీ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నాయి. దీనికి అదనంగా “అల్ మొహేద్ అల్ హిందీ” (నేవీ), “సదా తన్సీక్” (ఆర్మీ) వంటి ఉమ్మడి భద్రతా విన్యాసాలు ఇరు దేశాల ఆధ్వర్యంలో జరుగుతాయి. భారతదేశం – సౌదీ అరేబియా కూడా సాంకేతిక భాగస్వామ్యాన్ని పంచుకుంటాయి. ప్రస్తుతానికి ఈ రెండు ముస్లిం దేశాలు కూడా భారత్‌తో స్నేహంగా వ్యవహరిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అవసరం వచ్చినప్పుడే ఈ రెండు దేశాల్లో నిజమైన స్నేహితుడు ఎవరో తెలుస్తుందని చెబుతున్నారు.
READ ALSO: Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఒక నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా?
