Archana Kamath Quits TT: భారత టీటీ (టేబుల్ టెన్నిస్) ప్లేయర్ అర్చన కామత్ 24 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో పోరాట ప్రదర్శన చేసిన కొద్ది రోజులకే ఆటకు వీడ్కోలు పలకడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కెరీర్‌లో ఎదిగే సమయంలో అర్చన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం చదువు. ఆర్థికవేత్తగా స్థిరపడాలనే లక్ష్యంతో ఈ బెంగళూరు అమ్మాయి అమెరికా వెళ్లబోతోంది. మిచిగాన్ యూనివర్సిటీలో ఇప్పటికే అంతర్జాతీయ సంబంధాలు అంశంలో డిగ్రీ చేసిన అర్చన.. ఆర్థికశాస్త్రంలో మరో డిగ్రీ చేయడనికి సిద్దమైంది.
‘చిన్నప్పటినుంచి టీటీ సహా చదువూ చాలా ఇష్టం. గతేడాదే ఆటకు వీడ్కోలు పలికి స్టడీస్ కోసం అమెరికా వెళ్లామనుకున్నా. అదే సమయంలో టీమ్ విభాగంలో భారత్ జట్టు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అందుకే నా నిర్ణయాన్ని వాయిదా వేశా. ఒలింపిక్స్ ముగిశాయి కాబట్టి ఆటకు వీడ్కోలు చెప్పా. నా నిర్ణయానికి ఆర్థిక అంశాలు అస్సలు కారణం కాదు. టీటీ క్రీడాకారిణిగా నాకు పూర్తి మద్దతు లభించింది. రెండేళ్ల తర్వాత భారత్‌కు వచ్చి మరో రూపమ్లో దేశానికి సేవలందిస్తా’ అని అర్చన కామత్ తెలిపింది.
Also Read: Neeraj Chopra: డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా!
2023 జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో స్వర్ణం గెలిచిన అర్చన కామత్.. ఫామ్‌లో ఉన్న ఐహిక ముఖర్జీని వెనక్కి నెట్టి పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లే భారత జట్టులో చోటు దక్కించుకుంది. పారిస్‌లో ఆకుల శ్రీజ, మనిక బత్రా, అర్చన కామత్‌లతో కూడిన భారత మహిళల టీటీ జట్టు క్వార్టర్స్‌లో 1-3తో జర్మనీ చేతిలో ఓడిపోయింది. అర్చన మాత్రమే తన మ్యాచ్‌లో గెలిచింది. ఇక బెంగళూరుకు చెందిన 24 ఏళ్ల అర్చన పదో తరగతిలో 98.7 శాతం, ఇంటర్‌లో 97 శాతం మార్కులు సంపాదించింది. అర్చన తల్లిదండ్రులిద్దరూ వైద్యులు, సోదరుడు నాసాలో శాస్త్రవేత్త కావడం విశేషం.