Iran Attack On Indian Ships: భారత్ నౌకలపై దాడి.. ఇరాన్ రాయబారికి భారత్ సీరియస్ వార్నింగ్..

  • భారత నౌకలపై దాడి చేసిన ఇరాన్..
  • తీవ్రంగా స్పందించిన ఇండియా..
Flag Shipsss

Flag Shipsss

హర్మూజ్ జలసంధిలో భారత జెండాతో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై జరిగిన కాల్పుల ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ విషయంపై చర్చించేందుకు న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబారిని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఈ సాయంత్రం పిలిపించింది. భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి సదరు రాయబారితో భేటీ అయ్యి, ఈ కాల్పుల ఘటన పట్ల భారతదేశం తరపున తన తీవ్ర ఆందోళనను , నిరసనను వ్యక్తం చేశారు.

సముద్ర మార్గంలో ప్రయాణించే వణిజ్య నౌకల భద్రత, అలాగే అందులో పనిచేసే సిబ్బంది క్షేమం తమకు అత్యంత ముఖ్యమని భారత్ స్పష్టం చేసింది. గతంలో భారత్‌కు వచ్చే నౌకలకు సురక్షితమైన దారిని కల్పించడంలో ఇరాన్ సహకరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు జరిగిన కాల్పుల ఘటన చాలా తీవ్రమైనదని, దీనిపై ఇరాన్ ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని కోరారు.

భారతదేశానికి చెందిన నౌకలు ఎలాంటి ఆటంకం లేకుండా, సురక్షితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని ఇరాన్ అధికారులకు తెలియజేయాలని రాయబారిని భారత్ కోరింది. భారత ప్రభుత్వం వ్యక్తం చేసిన ఈ ఆందోళనలను, అభ్యర్థనలను తమ దేశ అధికారులకు ఖచ్చితంగా చేరవేస్తానని ఇరాన్ రాయబారి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సముద్ర రవాణాలో శాంతిని నెలకొల్పేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ ఈ ప్రకటనను విడుదల చేసింది.