Site icon NTV Telugu

India: ఆఫ్ఘనిస్థాన్‌కు అండగా భారత్‌.. మంచి మనసు చాటుకున్న ఇండియా

India Aid Afghanistan Earth

India Aid Afghanistan Earth

India: పొరుగు దేశాలకు సహాయం చేయడంలో ఇండియా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. నేపాల్, బంగ్లాదేశ్, మాల్దీవులు మాత్రమే కాకుండా సరిహద్దులకు దూరంగా ఉన్న టర్కీ, పాలస్తీనా వంటి దేశాలకు కూడా భారత్ సాయం చేసింది. సెప్టెంబర్ 1న, తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగర్‌హార్ ప్రావిన్స్‌లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపంతో అక్కడ సుమారుగా 1400 మందికి పైగా మరణించారు. ఈ దుఃఖ సమయంలో ఆఫ్ఘనిస్థాన్‌‌కు నిజమైన స్నేహితుడిగా సాయం చేయడానికి భారత్ ముందుకు వచ్చింది. భూకంపం తర్వాత కాబూల్‌కు ఇండియా 21 టన్నుల మానవతా సహాయాన్ని అందించిందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు.

READ ALSO: Drug Racket: గ్రిండర్ యాప్‌లో గుట్టురట్టు.. హైదరాబాద్‌లో గే గ్యాంగ్ డ్రగ్ రాకెట్!

విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ట్విట్టర్‌లో ఇలా పోస్ట్ చేశారు..”భారత భూకంప సహాయ సామగ్రి విమానంలో కాబూల్‌కు చేరుకుంది. దుప్పట్లు, టెంట్లు, పరిశుభ్రత కిట్లు, నీటి నిల్వ ట్యాంకులు, జనరేటర్లు, వంటగది పాత్రలు, పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైయర్లు, స్లీపింగ్ బ్యాగులు, అవసరమైన మందులు, వీల్‌చైర్లు, హ్యాండ్ శానిటైజర్లు, నీటి శుద్ధీకరణ మాత్రలు, ORS ప్యాకెట్లు, వైద్య వినియోగ వస్తువులు సహా 21 టన్నుల సహాయ సామగ్రిని విమానంలో తరలించాం” అని ఆయన పేర్కొన్నారు.

ఆఫ్ఘనిస్థాన్‌కు $5 మిలియన్లను కేటాయించిన ఐక్యరాజ్యసమితి
తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంప బాధితులకు తక్షణ సహాయం అందించడానికి అదనపు వనరులను అందించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న మానవతా సహాయ నిధులు అవసరాలను తీర్చడానికి సరిపోవు అని ఆయన అన్నారు. పరిస్థితిని అంచనా వేయడానికి, బాధితులకు మరింత సహాయం అందించడానికి తాలిబాన్ అధికారులతో కలిసి ఐక్యరాజ్యసమితి పనిచేస్తోందని తెలిపారు. తొలి అడుగుగా, సహాయక చర్యల్లో భాగంగా సహాయం చేయడానికి ఐక్యరాజ్యసమితి తన అత్యవసర నిధి నుంచి $5 మిలియన్లను కేటాయించిందని పేర్కొన్నారు.

కునార్ ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 1,411 కు పెరిగిందని, 3 వేలు మందికి పైగా గాయపడ్డారని, 5 వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని తాలిబన్లు తెలిపారు. నూర్గల్, సుకి, చాపా దారా, పెచ్ దారా, అసదాబాద్ జిల్లాల్లో మరణాలు సంభవించాయని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ X లో పేర్కొన్నారు.

READ ALSO: China Tomb Raiding Case: డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.. సమాధులను తవ్వి కటకటాల పాలయ్యాడు..

Exit mobile version