NTV Telugu Site icon

ICC Rankings: టెస్టుల్లోనూ నెంబర్‌వన్.. కెప్టెన్‌గా రోహిత్ సరికొత్త చరిత్ర

2

2

రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటికే టీ20, వన్డేల్లో నెంబర్‌ వన్‌గా ఉన్న్ భారత జట్టు తాజాగా టెస్టుల్లోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించడం ద్వారా నాలుగు పాయింట్లు పొంది టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 115 పాయింట్లు ఉన్నాయి. తద్వారా మూడు ఫార్మాట్లలోనూ ఏకకాలంలో నెంబర్‌వన్‌గా నిలిచిన ఘనతను టీమిండియా సొంతం చేసుకుంది. మరోవైపు భారత్‌తో తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ పరాజయం చవిచూసిన ఆస్ట్రేలియా 111 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఇక ఇంగ్లాండ్‌ 106 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్‌ 100 పాయింట్లతో నాలుగు, సౌతాఫ్రికా 85 పాయింట్లతో ఐదో ప్లేస్‌లో కొనసాగుతున్నాయి.

రోహిత్‌ హిస్టరీ..

కాగా, ఇలా ఏకకాలంలో మూడు ఫార్మాట్స్‌లోనూ టీమిండియా నెంబర్‌వన్‌గా అవతరించడం ఇదే తొలిసారి. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ఈ ఘనత అందుకోవడంతో హిట్‌మ్యాన్‌ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. టీమిండియాను ఒకేసారి అన్ని ఫార్మాట్లలోనూ నెంబర్‌వన్‌గా నిలిపిన కెప్టెన్‌గా రోహిత్‌ చరిత్రకెక్కాడు. ఇంతకుముందు ధోనీ సారథ్యంలో టీమిండియా అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్‌గా నిలిచినా.. ఇలా ఏకకాలంలో మాత్రం అగ్రస్థానం సంపాదించడం రోహిత్ కెప్టెన్సీలోనే సాధ్యమైంది. ఇంతకముందు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను గెలవడం ద్వారా టీమిండియా వన్డేల్లో నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం ద్వారా టి20 ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా నెంబర్‌వన్‌గా అవతరించింది. అయితే ఈ సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికి.. అధికారికంగా మాత్రం మూడు ఫార్మాట్లకు రోహిత్‌ శర్మనే ఇంకా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.

Also Read: Shami: అప్పుడు షమీ రిటైర్మెంట్‌ ప్రకటించాలని చూశాడు: టీమిండియా మాజీ కోచ్