NTV Telugu Site icon

INDvsNZ T20: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం..సిరీస్ కైవసం

India 2

India 2

అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరిదైన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌లో దుమ్మురేపిన భారత్‌.. బౌలింగ్‌లో అదరగొట్టడంతో 168 రన్స్ భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. టీ20ల్లో టీమిండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. 235 రన్స్ భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్‌ 12.1 ఓవర్లలో 66 రన్స్‌ చేసి ఆలౌటైంది. భారత బౌలర్లు దుమ్మురేపడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగులు సాధించేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఓపెనర్‌ ఫిన్ అలెన్‌ (3)ను మొదటి ఓవర్లోనే పెవిలియన్‌కు పంపిన పాండ్యా కివీస్ వికెట్ల ఖాతా తెరిచాడు. అనంతరం రెండో ఓవర్లో కాన్వే (1), చాప్‌మన్‌ (0)ను ఔట్ చేసిన అర్చదీప్ న్యూజిలాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఫిలిప్స్ (2), బ్రేస్‌వెల్ (8) శాంట్నర్ (13) కూడా పూర్తిగా విఫలమవడంతో 9ఓవర్లలోనే 53 రన్స్‌కు 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. డారైల్ మిచెల్ (35) ఒక్కడే పోరాడినా మిగతా బ్యాటర్ల నుంచి మద్దతు కరవవడంతో కివీస్‌ భారీ ఓటమి మూటగట్టుకుంది. ఇండియా బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ 4 వికెట్లతో అదరగొట్టగా.. అర్షదీప్, ఉమ్రాన్ మాలిక్, శివం మావి చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.

కాగా, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ సాధించింది. అద్భుత ఫామ్‌తో ఇరగదీస్తున్న యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ టీ20ల్లో తొలి సెంచరీ (63 బంతుల్లో 126 నాటౌట్) తో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 234 /4 స్కోర్ చేసింది. మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇషాన్ కిషన్ (1) మరోసారి విఫలమయ్యాడు. అనంతరం రాహుల్ త్రిపాఠి (44) కలిసి గిల్‌ బాదుడే లక్ష్యంగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ ప్రతర్థి బౌలర్లను ఆడుకోవడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే తొమ్మిదో ఓవర్లో త్రిపాఠిని ఔట్ చేసిన సోధి రెండో వికెట్‌కు 80 రన్స్ భాగస్వామ్యానికి తెరదించాడు. ఆపై సూర్యకుమార్ (24) గిల్‌కు సపోర్ట్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే 12 ఓవర్లో గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్య ఔటైనా.. గిల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. లిస్టర్ వేసిన 16వ ఓవర్లో రెండు సిక్సర్లతో పాటు టిక్నెర్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు సిక్స్‌లు ఓ ఫోర్ బాది సెంచరీకి దగ్గరగా వచ్చాడు. ఆపై 18వ ఓవర్లో మరో సిక్స్‌ బాది టీ20ల్లో మొదటి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక, హార్దిక్ (30) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించడంతో టీమిండియా భారీ స్కోర్ నమోదు చేసింది.

Show comments